దేవెగౌడ మనమడు కనిపించడం లేదు

వార్తాపేపర్‌లో ప్రకటన

prajiwal rewan
prajiwal rewan


బెంగళూరు: ఎవరైనా కనిపించడం లేదంటే దాన్ని పెద్ద వార్తగా పరిగణించం. అయితే ఏకంగా మాజీప్రధాని మనమడు కనిపించడం లేదంటే ఇది ఖచ్చితంగా సంచలన వార్తే అవుతుంది. లోక్‌సభ ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చారని ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ మనుమడు, హాసన్‌ లోక్‌సభ సభ్యుడు ప్రజ్వల్‌ రేవణ్ణ కనపడటం లేదని, సమన్లు తీసుకోలేని న్యాయవాది చెప్పడంతో దినపత్రికల్లో ప్రకటన ఇవ్వాలని కర్ణాటక హైకోర్టు సూచించింది. హైకోర్టు ఆదేశాలతో మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ సభ్యులు, జెడిఎస్‌ నాయకులు షాక్‌కు గురైనారు. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో హాసన్‌ నియోజకవర్గం నుంచి మాజీ ప్రధాని హెచ్‌.డి.దేవెగౌడ మనుమడు, మాజీ మంత్రి హెచ్‌.డి.రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్‌ రేవణ్ణ పోటీ చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో ప్రజ్వల్‌ రేవణ్ణ ఎన్నికల కమిషన్‌కు
ఆస్తుల వివరాల అఫిడవిట్‌ సమర్పించాడు.

ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడవిట్‌లో ప్రజ్వల్‌ రేవణ్ణ ఆయన ఆస్తుల పూర్తి వివరాలు ఇవ్వలేదని, తప్పుడు సమాచారం ఇచ్చి ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి, ప్రజ్వల్‌ రేవణ్ణ మీద పోటీచేసిన ఎ.మంజు (బిజెపి) ఫిర్యాదు చేయడంతో హైకోర్టు విచారణ చేపట్టింది. కర్ణాటక హైకోర్టు కేసు విచారణ చేసి జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణకు సమన్లు జారీ చేసింది. అయితే జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ మాత్రం ఇంతవరకు హైకోర్టు సమన్లను తీసుకోలేదు. ప్రజ్వల్‌ రేవణ్ణకు కోర్టు సమన్లు ఇవ్వడానికి కోర్టు సిబ్బంది, న్యాయవాది ఇంత వరకు ప్రయత్నించారు. హాసన్‌లోని జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌రేవణ్ణ ఇంటికి వెళ్లి ఆయనకు సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించామని, ఆయన ఇచ్చిన చిరునామాలో లేరని, చాల రోజుల నుంచి సమన్లు ఇవ్వడానికి ప్రయత్నించినా ఆయన కనపడటం లేదని న్యాయవాది హైకోర్టులో చెప్పారు. సమన్లు తీసుకోలేని ప్రజ్వల్‌ రేవన్ణకు పత్రికా ప్రకటన ద్వారా విషయం తెలియజేడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా, సమన్లు తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే జెడిఎస్‌ ఎంపి ప్రజ్వల్‌ రేవణ్ణ మీద కోర్టు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు.
తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/