శాస్త్ర, సాంకేతిక, సృజనాత్మక రంగాల్లో మార్పు అవసరం

pm modi
pm modi

బెంగళరూ: ప్రధాని మోడి బెంగళూరులో 107 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. కొత్త సంవత్సరంలో తన కొత్త కార్యక్రమం… సైన్స్ అండ్ టెక్నాలజీతో ముడిపడి ఉండటం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. స్టార్టప్‌ల కేంద్రం బెంగళూరు అన్న ఆయన… ప్రతీ ఒక్కరి స్వప్నమూ బెంగళూరులో నెరవేరుతోందన్నారు. సైన్స్ సమీక్షల్లో భారత్ మూడోస్థానానికి చేరిందన్న మోడి… ఇన్నోవేటివ్ ఇండెక్స్‌లో భారత్ 52వ స్థానానికి వచ్చిందన్నారు. వేగవంతమైన అభివృద్ధికి నవకల్పన, వస్తు ఉత్పత్తి, ప్రజల సహకారం ఉండాలన్న మోడి… ప్రజల మద్దతుతోనే సరికొత్త ఇండియా రూపకల్పన జరుగుతోందన్నారు. ఇందుకు సైన్స్ అండ్ టెక్నాలజీ పాత్ర ఎంతో ఉందన్నారు. గ్రామాల్లో సైన్స్ అండ్ టెక్నాలజీని అభివృద్ధి చేసేందుకు… స్వచ్ఛ భారత్, ఆయుష్మాన్ భారత్ ద్వారా కృషి చేస్తున్నామన్న మోడి… టెక్నాలజీ, మంచి పాలన అందిస్తున్నామన్నారు. దేశంలో 6 కోట్ల మంది రైతులకు… పీఎం సమ్మాన్ నిధి ద్వారా… రైతులకు నిధులు ఇస్తున్నామన్నారు. ఆధార్ సహిత టెక్నాలజీ ద్వారానే ఇది సాధ్యమవుతోందన్నారు.


జియో ట్యాగింగ్, డేటా సైన్స్, రియల్ టైమ్ మానిటరింగ్ వ్యవస్థలు అన్నీ టెక్నాలజీ ద్వారా సాధ్యమవుతున్నాయన్నారు. తమ ప్రయత్నాలు మరింత ముందుకు తీసుకెళ్తామన్నారు. ప్రతీ అంశంలో సైన్స్ వాడకాన్ని పెంచుతామన్నారు. డిజిటల్ టెక్నాలజీ, ఈకామర్స్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ వంటివి గ్రామాలకు చేరువయ్యాయన్నారు. రైతులు వాతావరణ వివరాల్ని తమ మొబైల్స్ ద్వారా తెలుసుకుంటున్నారని వివరించారు. వచ్చే దశాబ్దంలో భారత్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దూసుకుపోయేలా చేస్తామన్నారు. దీని ప్రయోజనాలు గ్రామాల్లో ప్రజలకు చేరేలా చేస్తామన్నారు. జల్ జీవన్ మిషన్ ఇలాంటిదే అన్నారు. దీనివల్ల నీటిని రీసైక్లింగ్ చేసి, మళ్లీ వాడుకునేందుకు వీలవుతోందన్నారు. నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అందరం సన్నద్ధం కావాలన్నారు. నీటి వాడకాన్ని తగ్గించాలన్నారు. దేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ వాడకాన్ని తగ్గించుకోవాలన్నారు. అలా చేస్తే,… పక్షులు, జంతువులు, చేపలు, భూమి, పర్యావరణానికి మేలు జరుగుతుందన్నారు. ప్లాస్టిక్ స్థానంలో మట్టి పాత్రలు, నార సంచులు, ఫైబర్ వంటివి వాడాలన్నారు.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/