మహాబలిపురంలో జిన్‌పింగ్‌, మోడిల చర్చలు

తమిళ ఆహార్యంతో సరికొత్తగా మోడి

pm-modi-xi-jinping
pm-modi-xi-jinping

చెన్నై: ప్రధాని నరేంద్రమోడి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మహాబలిపురంలో చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ చెన్నై చేరుకున్నారు. అక్కడి నుంచి మహాబలిపురం వెళ్లారు. ఈ సందర్భంగా మహాబలిపురంలో ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. తమిళ సంప్రదాయాలను ప్రతిబింబించే రీతిలో మోదీ లుంగీకట్టుతో కనిపించడం విశేషం. అచ్చం ఓ తమిళుడిని తలపించే ఆహార్యంతో ఆయన జిన్ పింగ్ కు స్వాగతం పలికారు. మహాబలిపురంలోని అనేక చారిత్రక ప్రదేశాలతో పాటు యునెస్కో వారసత్వ కట్టడాలను కూడా జిన్ పింగ్ కు దగ్గరుండి చూపించారు.  మోడీ మహాబలిపురంలో అపురూపమైన కానుకలను అందించారు. నృత్య సరస్వతి చిత్రపటం, నచియార్‌కోయిల్ హంస దీపం బహుమతిని ఇచ్చారు. విశేష ఖ్యాతి గడించిన తంజావుర్ చిత్రకారుడు బి లోగనాథన్ రూపొందించిన నృత్య సరస్వతి అత్యంత అరుదైనదిగా అలరించింది. 16వ శతాబ్దపు చిత్ర కళారూపమైన తంజావూర్ చిత్రకళను చైనా అధినేతకు ఈ పటంతో మోడీ పరిచయం చేశారు. నాయక, మరాఠా రాజుల పాలనలో ఈ కళ విలసిల్లింది. ఇక హంస దీపాన్ని ఎనిమిది మంది నిపుణులు అత్యంత ఆకర్షణీయమైన శాఖాదీపాలతో రూపొందించారు. చారిత్రక కట్టడాల వీక్షణ, ఇక్కడి తియ్యటి కొబ్బరి నీరు సేవనం, నృత్యరూపకాల వీక్షణం తరువాత చైనా అధినేత ఈ అందమైన కానుకల స్వీకరణం చేశారు.


తాజా ఇపేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/