ప్రయోగం 95 శాతం విజయవంతం.. ఆర్బిటర్ తిరుగుతుందిగా

Chandrayaan-2
Chandrayaan-2

బెంగళూరు: చంద్రయాన్2 ప్రయోగం చివరిదశలో విఫలం కావడంతో యావత్ భారతదేశం నిరాశకు గురైంది. ఎవరెన్ని ఓదార్పు వచనాలు పలికినా, శాస్త్రవేత్తల సహా ప్రతి ఒక్కరూ నిస్పృహకు గురయ్యారన్నది వాస్తవం! అయితే, ఇంతటి బాధాకరమైన క్షణాల్లోనూ ఓ ఇస్రో సీనియర్ అధికారి చెబుతున్న మాటలు ఊరట కలిగిస్తున్నాయి.

విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం ఆగిపోయినంత మాత్రాన చంద్రయాన్2 పూర్తిగా విఫలం అయినట్టు కాదని ఆ అధికారి స్పష్టం చేశారు. ఈ మొత్తం ప్రయోగంలో 5 శాతం మాత్రమే విఫలమైనట్టు భావించాలని, చంద్రుడి చుట్టూ నిర్దేశిత కక్ష్యలో ఆర్బిటర్ పరిభ్రమిస్తూనే ఉందని, అది ఎంతో విలువైన సమాచారం సేకరించి భూమికి పంపిస్తుందని వివరించారు. సంవత్సరం పాటు ఆర్బిటర్ నుంచి చంద్రుడికి చెందిన ఫొటోలు, ఇతర డేటా అందుతుందని వెల్లడించారు. ఆ లెక్కన చూస్తే చంద్రయాన్2 ప్రయోగం 95 శాతం సక్సెస్ అయినట్టేనని ఆ సీనియర్ అధికారి పేర్కొన్నారు. ఆర్బిటర్‌ జీవితకాలం ఏడాది కాగా, ఆ సమయంలో జాబిల్లి చిత్రాలు, ఇతర సమాచారం అందజేస్తుందని తెలిపారు. అంతేకాదు, ల్యాండర్ పరిస్థితి గురించి చిత్రాలను తీస్తుందని వారు వివరించారు. చంద్రయాన్2 వ్యోమనౌకలో ఆర్బిటర్‌ (2,379 కిలోల బరువు, ఎనిమిది పేలోడ్లు), విక్రమ్ ల్యాండర్ (1,471 కిలోలు, నాలుగు పేలోడ్లు), ప్రజ్ఞాన్‌ రోవర్ (27 కిలోలు, రెండు పేలోడ్లు) అమర్చారు. సెప్టెంబరు 2 ఆర్బిటర్ నుంచి విక్రమ్ విడిపోయింది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/