చంద్రయాన్‌-2పై స్పందించిన మోడి


రేపు చంద్రుడిపై చంద్రయాన్2 ల్యాండింగ్
ఉద్విగ్నత ఆపుకోలేకపోతున్నానంటూ వ్యాఖ్యలు

pm modi
pm modi

న్యూఢిల్లీ: భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన చంద్రయాన్2 సెప్టెంబరు 7న చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగుపెట్టనుంది. 130 కోట్ల మంది భారతీయులు అత్యంత ఆసక్తిగా వేచిచూస్తున్నది ఈ మధుర క్షణాల కోసమేనని ప్రధాని నరేంద్ర మోడి ట్విట్టర్ లో స్పందించారు. మరికొన్ని గంటల్లోనే చంద్రయాన్2 ప్రయోగంలో ఆఖరి అంకానికి తెరలేవనుందని, తద్వారా భారత్ తో పాటు తక్కిన ప్రపంచం కూడా ఇస్రో శాస్త్రవేత్తల సామర్థ్యాన్ని మరోసారి చూస్తుందని పేర్కొన్నారు.

”బెంగళూరులోని ఇస్రో సెంటర్ నుంచి ఈ ప్రక్రియను వీక్షించడానికి ఎంతో ఉద్విగ్నతకు గురవుతున్నాను. భారత అంతరిక్ష చరిత్రలోనే అసాధారణ ఘట్టం ఇది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన కుర్రాళ్లు కూడా ఈ ప్రత్యేక క్షణాలను ఆస్వాదించనున్నారు. మిత్రదేశం భూటాన్ కు చెందిన యువతీయువకులు కూడా ఈ ఘట్టాన్ని వీక్షిస్తారు. చంద్రయాన్2 నింగికెగిసిన జూలై 22వ తేదీ నుంచి ఇప్పటివరకు ఈ ప్రయోగానికి సంబంధించిన ప్రతి సమాచారాన్ని ఆసక్తిగా గమనిస్తున్నాను. ఈ ప్రయోగం భారత్ లో ఉన్న అత్యుత్తమ నైపుణ్యానికి, ఉక్కు సంకల్పానికి ప్రతిరూపం. ఈ విజయంతో కోట్ల మంది భారతీయులకు లబ్ది చేకూరనుంది” అంటూ మోడి వరుస ట్వీట్లు చేశారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telengana/