కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై కత్తితో దాడి

Tanveer Sait
Tanveer Sait

బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తన్వీర్‌ సెథ్‌పై కత్తితో దాడి చేసి హతమార్చడానికి ప్రయత్నించిన ఘటన కలకలం రేపింది. మైసూరులో ఒక వివాహ వేడుకకు హజరైనప్పుడు ఎమ్మెల్యే సేథ్‌పై ఈ దాడి చోటు చేసుకుంది. కత్తితో దాడి చేయడం వల్ల ఎమ్మెల్యే తీవ్రంగా గాయపడటంతో ఎమ్మెల్యేను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన వ్యక్తి తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికి ఎమ్మెల్యే అనుచరులు అతన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. కాగా దాడికి పాల్పడిన వ్యక్తి 24 ఏళ్ల ఫర్హాన్‌ పాషాగా గుర్తించారు. ఇంకా నిందితుడు ఉదయగిరికి చెందిన హస్తకళాకారుడని, దాడికి గల కారణాలు ఇంటరాగేట్‌ చేస్తున్నామని పోలీసు కమిషనర్‌ కేటీ బాలకృష్ణ తెలిపారు. కాగా ఉద్యోగం కోసం ఎమ్మెల్యేను అతను రెండు మూడు సార్లు కలుసుకున్నాడని ఆ విషయంలో జాప్యం జరగడంతో తీవ్ర నిరాశకు గురై ఈ దాడికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. అతనిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/