మద్రాసు హైకోర్టు చీఫ్ జస్టిస్ రాజీనామా

Tahilramani
Tahilramani

చెన్నై: మేఘాలయ హైకోర్టుకు బదిలీ అయిన మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి విజయ కె తహిల్రామణి తన పదవి కి ఈరోజు రాజీనామా చేశారు. చెన్నైలో శుక్రవారం రాత్రి కొందరు న్యాయమూర్తులు ఏర్పాటు చేసిన విందులో ఆమె తన రాజీనామా నిర్ణయాన్ని వెల్లడించినట్లు తెలిసింది. రెండు రోజుల క్రితం శాశ్వత న్యాయమూర్తులుగా నియమితులైన ఆరుగురు అదనపు న్యాయమూర్తులు ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు.

మేఘాలయ హైకోర్టుకు బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని ఆమె సుప్రీంకోర్టు కొలీజియంకు ఇదివరకే ఆమె చేసుకున్న అభ్యర్థన తిరస్కరణకు గురైంది. తన రాజీనామా లేఖను ఆమె రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌కు పంపి దాని ప్రతిని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస రంజన్ గొగోయ్‌కు పంపినట్లు అధికార వర్గాలు తెలిపాయి. మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా గత ఏడాది ఆగస్టు 8న ఆమె నియమితులయ్యారు. చీఫ్ జస్టిస్ తహిల్రామణిని చెన్నై నుంచి బదిలీ చేయకూడదని కోరుతూ పలువురు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌కు లేఖ కూడా రాశారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/