కిరణ్‌బేడీ పర్యటనకు నిరసనల సెగ

kiran bedi
kiran bedi

యానాం: పుదుచ్చేరిలోని యానాంలో పర్యటించనున్న లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి స్థానికంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో భాగమైన యానాంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీ రెండు రోజులు పర్యటించనున్నారు.అయితే ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేయకుండా కిరణ్‌బేడీ అడ్డుపడుతోందని స్థానిక ఎమ్మెల్యే, పర్యాటక మంత్రి మల్లాడి కృష్ణారావు నిరసనలకు పిలుపునిచ్చారు. దీంతో స్థానిక అధికార యంత్రాంగం అదనపు భద్రతకోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల పోలీసుల సహాయం కోరింది. ప్రశాంతగా ఉండే పుదుచ్చేరిలోని యానాం నియోజకవర్గం ప్రస్తుతం నివురుగప్పిన నిప్పులా ఉంది. కేంద్ర ప్రాయోజిత పథకాలతో పాటు, రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేస్తున్నా కర్యాక్రమాలకు కిరణ్‌బేడీ అడ్గుతగులుతున్నారని అధికార పార్టీ ఆరోపిస్తున్నది. రెండురోజుల పర్యటన నిమిత్తం వస్తున్న కిరణ్‌బేడీకి తమ నిరసనలు తెలపాలని కాంగ్రెస్‌ నిర్ణయించింది. యానాం ఎమ్మెల్యే, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు స్వయంగా నిరసనలకు పిలుపునివ్వడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

రాష్ట్రమంత్రి మల్లాడి కృష్ణారావుకు స్థానికంగా కూడా మంచి పట్టు ఉంది. ఈ నేపథ్యం కిరణ్‌బేడీ పర్యటనకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు పక్కనే ఉన్న తమిళనాడుతో పాటు ఎపి ప్రభుత్వం సాయం కూడా కోరారు. ఎపి ప్రభుత్వం ఇప్పటికే విశాఖ నుంచి 200 మంది పోలీసులను పంపించింది. పుదుచ్చేరిలో 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణస్వామి ప్రభుత్వం ఘనవిజయం సాధించి అధికారం చేపట్టింది. సార్వత్రిక ఎన్నికల్లోను తమ సత్తా చాటింది. దేశమంతా బిజెపి గాలి వీచినా పుద్దుచ్చేరిలో మాత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి ఎంపిగా గెలిచారు. నారాయణస్వామి ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కేంద్రం కిరణ్‌ బేడీని లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ఆ రాష్ట్రానికి పంపించింది. అయిదే ఆమె ప్రభుత్వ కార్యకలాపాల్లో ఎక్కువగా జోక్యం చేసుకుంటుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ వచ్చిన నారాయణస్వామి ప్రభుత్వం చాలాసార్లు బహిరంగంగానే ఆరోపణలు చేశారు. యానాం అభివృద్ధి కోసం పలు సంక్షేమ పథకాలకు కేంద్రం వద్ద నిధులు తీసుకొచ్చిన పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు వాటి వినియోగానికి కిరణ్‌ బేడీ అడ్డంకులు కల్పిస్తున్నారని ఆగ్రహంగా ఉన్నారు. కిరన్‌బేడీకి ఈ విషయాన్ని చెప్పినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె పర్యటన సంరద్భంగా నిరసనలు తెలపలని నిర్ణయించినట్లు చెప్పారు. కిరణ్‌బేడీ యానాం వస్తే ఆమెకు తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించడం చర్చనీయాంశమయింది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/