కేంద్రం అనుమతితో ఎన్నార్సీ అమలు చేయనున్న కర్ణాటక

NRC
NRC

బెంగళూరు: అస్సాంలో వలసవాదులను గుర్తించేందుకు ఎన్నార్సీని అమలు చేసినట్లుగా కర్ణాటకలోను అమలు చేయాలనుకుంటున్నట్లు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ యోచిస్తోంది. ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి పార్టీ అధినాయకత్వం అనుమతి కోసం ఎదురు చూస్తున్నది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి ఆదేశాలు అందిన వెంటనే ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటోంది. రాష్ట్రంలో జాతీయ పౌర జాబితా (ఎన్నార్సీ)ని రాష్ట్రంలో అమలు చేయడానికి కేంద్రం అనుమతుల కోసం ఎదురు చూస్తున్నామని కర్ణాటక హోం శాఖ మంత్రి బసవరాజ్‌ బొమ్మై తెలిపారు. కర్ణాటకలో ఎన్నార్సీ అమలయితే దక్షిణాది రాష్ట్రాల్లో ఎన్నార్సీ అమలు చేసిన మొదటి రాష్ట్రమవుతుంది. కర్ణాటక వలసదారులు ఎక్కువగా ఉన్న రాష్ట్రమని, ఎన్నార్సీని అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని బొమ్మై అన్నారు. దేశవ్యాప్తంగా ఎన్నార్సీని అమలు చేయాలంటూ కేంద్ర మంత్రి అమిత్‌ షా చేసిన సూచలను తాము పాటిస్తామని అన్నారు. పౌరుల వివరాలను సేకరించేపనిలో ఉన్నామని, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి లభించిన వెంటనే ఎన్నార్సీని అమలు చేస్తామని చెప్పారు. బెంగుళూరు, మైసూరు, మంగుళూరు, బీదర్‌, గుల్బర్గా, విజయపురా వంటి ప్రధాన నగరాల్లో పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వారు వందల సంఖ్యలో ఉన్నారని, వారిలో కొందరు క్రిమినల్స్‌ కూడా ఉన్నారన్నారు. ఇతర రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడి కర్ణాటకలో తలదాచుకుంటున్నట్లు పోలీసుల వద్ద పక్కా సమాచారముందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నార్సీ అమలు చేయాల్సిన అవసరముందని కేంద్రానికి తెలుపనున్నట్లు బసవరాజ్‌ బొమ్మై అన్నారు. పొరుగు రాష్ట్రాల నేరస్తులకు తమ రాష్ట్రంలో ఆశ్రయం ఇవ్వలేమని ఆయన పేర్కొన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/