ఏటిఎంలో రూ.100కు బదులు రూ.500 నోట్లు

రూ. 1.7 లక్షలు నగదు డ్రా చేసుకున్న ప్రజలు

canara bank
canara bank

బెంగళూరు: మీరెప్పుడైనా ఏటిఎంలో రూ.100కు బదులు రూ. 500 నోట్లు రావడం చూసారా? అవును ఓ ఏటిఎం మిషన్లో రూ.100 కు బదులుగా రూ.500 వచ్చాయి. కర్ణాటకలో కొడగు జిల్లాలో గల మడికేరి ప్రాంతంలో గల ఓ ఏటిఎంలో ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయాన్ని బ్యాంకు దృష్టికి తీసుకెళ్లే వరకే అక్కడికి వచ్చిన ప్రజలు దాదాపుగా రూ. 1.7 లక్షల నగదును డ్రా చేసుకుని వెళ్లిపోయారు. అయితే దీనిపై పట్టణ ఎస్‌పిని అడడగా బ్యాంకు నుంచి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌పి సుమన్‌ పెనిక్కర్‌ తెలిపారు. మరోవైపు బ్యాంకు అధికారులు డబ్బు డ్రా చేసిన వారిని గుర్తించారు. అయితే తీసుకున్న నగదును తిరిగి చెల్లించాల్సిందిగా కోరగా, కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే తిరిగి చెల్లించారు. మిగిలిన వారు ఒప్పుకోలేదు, అది బ్యాంకు పొరపాటని, తామెందుకు తిరిగివ్వాలని వాదనలు చేశారు. దీంతో ఏటిఎంలో నగదును అమర్చే సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆ వ్యక్తులకు సర్దిచెప్పటంతో మిగిలిన డబ్బు తిరిగి వచ్చింది. అయితే ఈ విషయంలో నగదును ఏటిఎంలో ఉంచే సంస్థ ఒక తప్పు చేసింది. రూ. 100 నోట్లను ఉంచాల్సిన బాక్సులో రూ. 500 నోట్లను ఉంచింది. దాని కారణంగా ఈ అనర్థం జరిగింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/