విభజించే శక్తులు రాష్ట్రంలోకి చొరబడ్డాయి

Kamal Haasan
Kamal Haasan

సైదాపేట: ఎంఎన్‌ఎం అధ్యక్షుడు కమల్‌హాసన్‌ తూత్తుకుడి లోక్‌సభ ఎంఎన్‌ఎం అభ్యర్థి పొన్‌కుమార్‌, విళాత్తికులం అసెంబ్లీ అభ్యర్థి నటరాజన్‌లకు మద్దతుగా ఆయన తూత్తుకుడిలో ఆదివారం సాయంత్రం ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టెరిలైట్‌ పరిశ్రమకు అనుమతి ఇచ్చింది ఒక పార్టీ అని, విస్తరణకు అవకాశం కల్పించింది మరో పార్టీ అని ఆయన పేర్కొన్నారు. తూత్తుకుడి అంటేనే ఓడరేవు గుర్తుకు రావాలన్నారు. కానీ తుపాకీ కాల్పులు గుర్తుకు వస్తున్నాయని తెలిపారు. దేశాన్ని విభజించే శక్తులు రాష్ట్రంలోకి చొరబడ్డాయని, వాటిని తొలగించాలని పేర్కొన్నారు. స్టెరిలైట్‌ పరిశ్రమ వద్దని తాను చెప్పటం లేదని తెలిపారు. దాని కాలుష్యంతో ప్రజలకు ఎలాంటి హానీ జరగకుండా చూడాలన్నారు.తాను 20 ఏళ్లకు ముందు రాజకీయాలలోకి వచ్చుంటే ఈ అన్యాయం జరిగేది కాదని తెలిపారు. తమిళనాడు చరిత్రను తిరగరాసే రోజు దగ్గర్లో ఉందని పేర్కొన్నారు. తాను పోటీ చేయకపోవటం గురించి కొంత మంది ప్రశ్నిస్తున్నారని తెలిపారు. ఎంఎన్‌ఎం తరఫున పోటీ చేసే అభ్యర్థులంతా తన ప్రతిరూపాలని వ్యాఖ్యానించారు. వారిని ఎన్నికలలో గెలిపించి వారు చేసే పనుల ద్వారా ప్రజలు తనను చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు.


మరిన్ని తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/