రాం జెఠ్మలానీ కన్నుమూత

Ram Jethmalani
Ram Jethmalani

న్యూఢిల్లీ : సంక్లిష్ట వ్యాజ్యాలతో న్యాయస్థానాలలో తలపడి, న్యాయవాదిగా తలపండిన రాంజెఠ్మలానీ ఆదివారం కన్నుమూశారు. ప్రముఖ న్యాయవేత్తగా, మాజీ కేంద్రమంత్రిగా సుపరిచితులైన జెఠ్మలానీ తమ 95వ ఏట ఇక్కడి తమ అధికారిక నివాసంలో మృతిచెందారు. ఆయన కొద్ది నెలలుగా అస్వస్థతతో ఉన్నారని కుమారుడు మహేష్ జెఠ్మలానీ తెలిపారు. ఉదయం 7.45 గంటలకు ఆయన మృతిచెందినట్లు కుమారుడు వివరించారు. రాజకీయ దిగ్గజాలతో పలు కోర్టు కేసులలో ఆయన పోటీపడ్డారు. అత్యంత కీలకమైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్య కేసులలో నిందితుల తరఫున వాదించి సంచలనం సృష్టించారు. ఈనెల 14వ తేదీన ఆయన 96వ జన్మదినం జరగాల్సి ఉంది. దీనికి కొద్ది రోజులు ముందుగానే ఆయన తాను ఎంతగానో ప్రేమించిన వృత్తికి, తరువాత వచ్చిపడ్డ రాజకీయ ప్రవృత్తికి సెలవంటూ సాగిపొయ్యారు.

ఆదివారం సాయంత్రం నాలుగున్నర ప్రాంతంలోనే ఇక్కడి లోథీ రోడ్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరిగాయి. ఈ అంతిమ ఘట్టానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కుమారుడు మహేష్‌తో పాటు అమెరికాలో స్థిరపడ్డ కూతురు ఆయనకు ఉన్నారు. ఆయన మరో కూతురు రాణి జెఠ్మలానీ 2011లో మృతి చెందారు. మరో కుమారుడు జనక్ కూడా అకాల మరణం చెందారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రిగా జెఠ్మలానీ పనిచేశారు. అంతేకాకుండా పట్టణాభివృద్ధి వ్యవహారాల మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ కాలంలో ఆయన కేంద్ర మంత్రిగా విశిష్ట సేవలు అందించారు. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా 2010లో ఉన్న జెఠ్మలానీ 2004లో లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. జెఠ్మలానీ మరణ వార్త తెలియగానే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఇతర ప్రముఖులు సంతాప సందేశాలు వెలువరించారు.