ప్రపంచ ఆకలి నివేదిక.. 102వ స్థానం లో భారత్

పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే వెనుకబాటు

Global Hunger Report
Global Hunger Report

న్యూఢిల్లీ: ఆకలితో యుద్ధంలో పాకిస్థాన్‌తో పోలిస్తే భారతదేశం వెనకబడిపోయింది. ప్రపంచ ఆకలి సూచీలో 2019 (జిహెచ్‌ఐ)లో భారతదేశం స్థానం ఇప్పుడు 102. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 117 దేశాలను తీసుకుని ఆయా దేశాలలో ఆకలి సమస్య నిర్మూలనకు చేపట్టిన చర్యల ప్రతిపదికన ఈ సూచీలో ర్యాంకులు ఖరారు చేస్తారు. ఇప్పటి ర్యాంకింగ్‌లో భారతదేశం ఇరుగుపొరుగుదేశాలైన నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ల కన్నా వెనుకబడింది. భారతదేశంలో ఆకలి స్థాయి హెచ్చుగా ఉండటం ఆందోళనకర పరిణామం అని సర్వే జరిపిన సంస్థల వారు తెలిపారు. ఐరిష్ సహాయ సంస్థ కన్సర్న్ వరల్డ్‌వైడ్, జర్మనీకి చెందిన వెల్ట్ హంగర్ హిల్ఫే సంస్థలు సంయుక్తంగా అధ్యయనం జరిపి ఈ ఆకలి ర్యాంక్‌లను రూపొందించారు.గత ఏడాదితో పోలిస్తే భారతదేశం ర్యాంక్ ఈసారి మరింత దిగజారింది.

2018 సంవత్సరంలో మొత్తం 119 దేశాల పరిస్థితిపై ఆరాతీయగా భారత్ స్థానం 103గా ఉండేది. ఇక 2000 సంవత్సరంలో భారతదేశ స్థానం మొత్తం 113 దేశాలతో పోలిస్తే 83గా నిలిచింది. ఇప్పుడు 117 దేశాలతో సరిపోల్చగా భారతదేశం పరిస్థితి దిగజారింది. మన పొరుగునే ఉన్న పాకిస్థాన్ ర్యాంక్ ఈసారి 8 స్థానాలు మెరుగుపడింది. పాకిస్థాన్ 94, ఇక బంగ్లాదేశ్ 88, శ్రీలంక 66 స్థానాలతో నిలిచాయి. ఇక ఆకలి సమస్యలతో తీవ్ర స్థాయిలో సతమతమవుతున్న 45 దేశాలలో భారతదేశం కూడా ఉండటం పట్ల అధ్యయన సంస్థల విస్మయాన్ని అంతకు మించి ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే జిహెచ్‌ఐ ర్యాంకింగ్‌లు పతనమవుతూ వస్తున్నాయని, ఆకలి నిర్మూలన విషయంలో 2005లో ర్యాంకు సగటున 38.9గా ఉంది.

ఇక 2010లో ఇది 32కి చేరింది. ఇప్పుడు 2010 నుంచి 2019 వరకూ 30.3 పాయింట్ల మధ్యలో ఉంది. దీనిని బట్టి ఆకలి లేకుండా చేయడంలో వివిధ దేశాల ప్రభుత్వాలు క్షేత్రస్థాయిలో సరైన విధంగా వ్యవహించడం లేదనే విషయం స్పష్టం అవుతోంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/