పాక్ కు భారత్ విజ్ఞప్తి

 నిర్ణయాలపై ఓసారి సమీక్షించుకోవాలి

imran-khan, modi
imran-khan, modi

న్యూఢిల్లీ: పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వం స్పందించింది. తాము తీసుకున్న నిర్ణయాన్ని పాక్ పెద్దలు మరోసారి సమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేసింది.ఇండియాతో కొనసాగిస్తున్న అన్ని వ్యాపార, వాణిజ్య, ద్వైపాక్షిక బంధాలను రద్దు, ఇస్లామాబాద్ నుంచి రాయబారిని బహిష్కరించడం తగదని, ఈ తరహా నిర్ణయాలతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతాయని అభిప్రాయపడింది. సంబంధాల రద్దు దిశగా పాక్ చెబుతున్న కారణాలు క్షేత్రస్థాయిలో సహేతుకంగా కనిపించడం లేదని ప్రభుత్వం పేర్కొంది. ఆర్టికల్ 370 రద్దు అంశం పూర్తిగా భారత అంతర్గత వ్యవహారమని, దేశ సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకునేందుకు భారత రాజ్యాంగాన్ని సవరించుకునేందుకు తమకు అన్ని హక్కులూ ఉన్నాయని పేర్కొంది. భారత వ్యవహారాల్లో తలదూర్చితే విజయం సాధించలేరని హితవు పలికింది.

అభివృద్ధిలో మిగతా అన్ని భారత రాష్ట్రాల మాదిరిగానే జమ్మూ కాశ్మీర్ ను కూడా పరుగులు పెట్టించేందుకు పార్లమెంట్ లో తీసుకున్న నిర్ణయాన్ని, చేసిన చట్టాలను ఎవరూ వ్యతిరేకించలేరని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. జమ్మూ కశ్మీర్ రాష్ట్రంలోని లింగ వివక్షను తొలగించడంతో పాటు సామాజిక, ఆర్థికాభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న పాకిస్థాన్ పరిస్థితులను తమకు అనుకూలంగా చేసుకోవాలన్న ఉద్దేశంతోనే ఈ తరహా నిర్ణయాలను తీసుకుంటోందని ఇండియా ఆరోపించింది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/