అమెరికాకు భారత్‌ కౌంటర్‌


ఏ దేశం నుంచైనా ఆయుధాలు కొనే అధికారం మాకుంది

S Jaishankar
S Jaishankar

వాషింగ్టన్‌: రష్యా నుంచి అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ ఎస్400ను భారత్ కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ డీల్ పై అమెరికా గుర్రుగా ఉంది. ఇప్పటికే అభ్యంతరాలను కూడా వ్యక్తం చేసింది. 2017 చట్టం ప్రకారం రష్యా నుంచి భారీ ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపై అమెరికా ఆంక్షలను విధిస్తుంటుంది. అయినప్పటికీ అమెరికా హెచ్చరికలను భారత్ ఖాతరు చేయకుండా డీల్ వ్యవహారంలో ముందుకు సాగుతోంది.

ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ మాట్లాడుతూ, అమెరికాకు కౌంటర్ వేశారు. ఏ దేశం నుంచి ఏది కొనుగోలు చేయాలో, ఏది చేయకూడదో చెప్పే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. రష్యా నుంచి ఎస్400ను కొనుగోలు చేసే అధికారం భారత్ కు ఉందని చెప్పారు. ఆయుధాల కొనుగోళ్లు అనేవి పూర్తిగా భారత్ సార్వభౌమాధికారమని అన్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే పలుమార్లు స్పష్టంగా చెప్పామని తెలిపారు. ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని చెప్పారు. మూడు రోజుల పర్యటనకు గాను జైశంకర్ అమెరికా పర్యటనను వెళ్లారు. అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియోతో భేటీ కావడానికి ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అయితే, అమెరికా అభ్యంతరాలపై భేటీలో చర్చిస్తామని తెలిపారు.


తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/