వాయుసేనలో చేరిన అపాచి అటాక్ హెలికాప్టర్లు

రాత్రిపూట కూడా దాడిచేయగల సత్తా

Apache-attack-helicopters
Apache-attack-helicopters

పఠాన్‌కోట్‌: భారత అమ్ములపొదిలోకి మరో సరికొత్త అస్త్రం చేరింది. సరిహద్దులో ఉగ్రస్థావరాలను ఏర్పాటుచేసి ఉగ్రదాడులకు తెగబడుతున్న పాక్ పీచమణిచేలా చేసేందుకు అత్యాధునిక అపాచి ఏహెచ్64 అటాక్ హెలికాప్టర్లు భారత వైమానికదళం(ఐఏఎఫ్)లో చేరాయి. పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో వాయుసేన చీఫ్ బీఎస్ ధనోవా సమక్షంలో ఈ కార్యక్రమం పూర్తయింది. అమెరికా నుంచి 22 అపాచి అటాక్ హెలికాప్టర్లను కొనుగోలు చేసేందుకు భారత్ 2015లో ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా 8 హెలికాప్టర్లను అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ భారత్ కు అందించింది. ఈ అత్యాధునిక హెలికాప్టర్లను అమెరికా వాయుసేన ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వాడుతోంది. ఇద్దరు పైలెట్లు నడిపే ఈ అపాచి హెలికాప్టర్ ను రాత్రిపూట నడిపేందుకు నైట్ విజన్ సౌకర్యం ఉంది.

అలాగే శత్రువులను లక్ష్యంగా చేసుకునేందుకు 30 ఎంఎం ఎం230 చైన్ గన్ ను అమర్చారు. ఈ హెలికాప్టర్ల ద్వారా ఏజీఎం 114, హైడ్రా 70 మిస్సైళ్లను ప్రయోగించవచ్చు. ప్రస్తుతం అమెరికాతో పాటు జపాన్, ఇజ్రాయెల్, సింగపూర్, యూఏఈ ఈ హెలికాప్టర్ ను వాడుతున్నాయి. అన్నట్లు ఒక్కొక్క అపాచి హెలికాప్టర్ ను రూ.256.43 కోట్లకు అమెరికాకు చెందిన బోయింగ్ కంపెనీ అమ్ముతోంది. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే అపాచి హెలికాప్టర్లు గరిష్టంగా 500 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తాయి.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/news/international-news/