ఏరో ఇండియాషోలో భారీ అగ్నిప్రమాదం

బెంగాళూరు: బెంగాళూరులోని యలహంక ఎయిర్‌బేస్‌ స్టేషన్‌లో ఏరో ఇండియా వైమానిక ప్రదర్శన జరుగుతుంది. అయితే అక్కడ పార్కింగ్‌ ప్రాంతంలో ఈరోజు భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సూమారు 150కి పైగా కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు వెల్లడించారు. కాగా సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పది అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. పార్కింగ్‌ స్థలంలో కొన్ని వందల కార్లు, ద్విచక్రవాహనాలు ఉన్నాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మంటలు ఉవ్వెత్తున ఎగసి పడటంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ వ్యాపించింది. ఈ పార్కింగ్‌ స్థలానికి సమీపంలో కొన్ని విమానాలను కూడా ఉంచినట్లు తెలుస్తోంది. పార్కింగ్‌ ప్రదేశంలో ఎండు గడ్డి ఉండటంతో మంటలు త్వరగా వ్యాపించాయి. ఏరో ఇండియా గేట్‌ నంబరు 5 వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలం వద్ద ఏడు అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. పార్కింగ్‌ చేసిన ఓ కారులో మంటలు చెలరేగి పక్కనే ఉన్న కార్లకు వ్యాపించడంతో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న కొంతమంది అగ్నిమాపక సిబ్బంది స్వల్పంగా గాయపడ్డారు.