సినిమా పూర్తయ్యేసరికి ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది: కపిల్‌ సిబాల్‌

kapil sibal
kapil sibal

మోడీ వ్యాఖ్యలకు కాంగ్రెస్‌ కౌంటర్‌


న్యూఢిల్లీ: రెండోసారి అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అవినీతిపరులను జైలుకు పంపించామని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ చేసిన ప్రకటనకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఆర్థిక నేరస్తులను మరింతమందిని అరెస్టు చేస్తామని మోడీ హెచ్చరించారు. ప్రధాని హెచ్చరికలకు ఎదురు తిరిగిన కాంగ్రెస్‌ నేతలు నరేంద్ర మోడీ సినిమా పూర్తయ్యేసరికి దేశం దివాళా తీయడం ఖాయమన్నారు. కుప్పకూలుతున్న ఆర్థిక వ్యవస్థను నరేంద్రమోడీ సినిమాగా చూపించబోతున్నారా అంటూ ఎద్దేవా చేశారు. చిదంబరం అరెస్టు కేవలం ట్రైలర్‌ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని మోడీ జార్ఖండ్‌ రాజధాని రాంచిలో ఏర్పాటయిన బహిరంగ సభలో హెచ్చరించారు. దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, కేంద్ర మాజీమంత్రి కపిల్‌ సిబాల్‌ స్పందిస్తూ మోడీ 100 రోజుల పాలనలోనే ఆర్ధిక మాంద్యం దేశాన్ని చుట్టుముట్టిందని, జిడిపి దిగజారిందని అన్నారు. దేశంలో అతి పెద్ద వాహన తయారీ సంస్థలు సెలవు దినాలను పొడిగించుకుంటున్నాయనా గుర్తుచేశారు. ట్రైలర్‌లోనే ఆర్థిక పరిస్థితి ఇంత అధ్వాన్నంగా ఉంటే సినిమా ముగిసేటప్పటికీ దేశం దివాళీ తీసేలా ఉందని చెప్పారు. మొత్తం సినిమాను చూడాలని అనుకోవడం లేదన్నారు. మోడీ తొలి వందరోజుల పాలనలో దేశ స్థూల జాతీయోత్పత్తి అయిదు శాతానికి దిగజారిందన్నారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/