నాలుగో కక్ష్యలో చంద్రయాన్-2

7న చంద్రుడిపై వాలేందుకు వీలు

Chandrayaan-2
Chandrayaan-2

బెంగళూరు : చంద్రయాన్ 2 ఇప్పుడు అత్యంత విజయవంతంగా చంద్రుడి నాలుగో కక్షలో పరిభ్రమణలను పూర్తి చేసింది. చంద్రుడి వద్దకు అపూర్వ ప్రయోగానికి దిగిన ఇస్రో శుక్రవారం ఈ వివరాలను వెల్లడించింది. చంద్రుడి వద్దకు వ్యోమనౌక చేరడానికి మరో కక్ష మిగిలి ఉంది. చంద్రుడి చుట్టూ ఉండే పలు వలయాలను నిర్ణీత స్థాయిల్లో దాటుకుంటూ వెళ్లితే అనుకున్న విధంగా చంద్రయాన్ చంద్రుడి ఉపరితలానికి చేరుకుంటుంది. ఎటువంటి ప్రతిబంధకాలు, సాంకేతిక లొసుగులు లేకుండా చంద్రయాన్ వ్యోమనౌక పరిభ్రమణలు సాగుతున్నాయి.

వ్యవస్థలోని ఇంజిన్లను ఇంధనంతో మండించడం ద్వారా కక్షల ఎత్తును పెంచి నిర్ణీత కక్షలోకి చేర్చే ప్రక్రియ చేపట్టారు. సాయంత్ర ఆరుగంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో 4వ కక్ష్యలోకి చంద్రయాన్ చేరింది. ఇక కొద్ది దూరంలో ఉన్న చంద్రుడి వద్దకు చేరేందుకు సర్వం సమాయత్తంగా ఉందని ఇస్రో వర్గాలు తెలిపాయి. నాలుగో కక్షలో చంద్రయాన్ నౌక తిరుగాడుతున్నప్పటి ఛాయాచిత్రాలను కూడా ఇస్రో వెలువరించింది. నాలుగో కక్షలో మొత్తం నాలుగు పరిభ్రమణలు జరగాల్సి ఉంది. ఇవన్నీ కూడా అనుకున్నట్లుగానే పూర్తయ్యాయి. ఇక సెప్టెంబర్ 1వ తేదీన భారతీయ కాలమానం ప్రకారం సాయంత్రం ఆరుగంటల నుంచి ఏడు గంటల మధ్యలో చంద్రయాన్ తదుపరి పరిభ్రమణలు ఉంటాయి.

ఆదివారం వ్యోమనౌక తుది కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. తరువాత చంద్రుడి ఉపరితలానికి వంద కిలోమీటర్ల దూరంలోని చంద్రడి ధృవం మీదుగా వెళ్లుతుంది సెప్టెంబర్ రెండవ తేదీన ల్యాండర్ ఆర్బిటార్ నుంచి విడిపోయి , చంద్రుడి చుట్టూ ఉండే కక్షలోకి చేరుతుంది. ఇవన్నీ పూర్తయితే ఇస్రో అంచనాల మేరకు సెప్టెంబర్ 7వ చంద్రుడి దక్షిణ భాగం వైపున చంద్రయాన్ దిగడానికి పలు సంక్లిష్ట విన్యాసాలకు దిగాల్సి ఉంటుంది. ఆ తరువాత చంద్రుడి ఉపరితలంపై అత్యంత సురక్షితంగా వాలేందుకు వీలేర్పడుతుంది. ఉపరితలంపైకి సజావుగా చేరడమే అత్యంత కీలకమైన ప్రక్రియ అని, ఇస్రోకు ఇది ఇంతకు ముందు ఎప్పుడూ అనుభవం లేని ప్రక్రియ అని ఇస్రో ఛైర్మన్ శివన్ తమ ముందున్న సవాలును తెలియచేశారు.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/