వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినేందుకు వెళ్తున్నా

BABA RAMDEV
BABA RAMDEV

న్యూఢిల్లీ: యోగా గురు బాబా రాందేవ్ సంచలన ప్రకటన చేశారు. సీఏఏను వ్యతిరేకిస్తూ దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు ప్రాంతాల్లో కొన్ని వారాల నుంచి నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని షహీన్ బాగ్ లో ఆందోళన చేస్తున్న నిరసనకారుల వద్దకు ఈరోజు బాబా రాందేవ్ వెళ్తున్నానని చెప్పారు. వారు ఏం చెప్పాలనుకుంటున్నారో వినేందుకు వెళ్తున్నానని తెలిపారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ, నిరసన వ్యక్తం చేయడం ప్రజల హక్కు అని చెప్పారు. అయితే నిరసన కార్యక్రమాలు రాజ్యాంగబద్ధంగా ఉండాలని అన్నారు. దేశంలో అరాచకత్వం పెరిగిపోతోందని అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలు చేసిన స్పల్ప వ్యవధిలోనే నిరసనకారుల వద్దకు వెళ్లాలని బాబా రాందేవ్ నిర్ణయించుకోవడం గమనార్హం.

ఈ సందర్భంగా బాబా రాందేవ్ మాట్లాడుతూ, తాను ఏ ఒక్కరికీ వ్యతిరేకం కాదని అన్నారు. హిందువులు, ముస్లింలు ఘర్షణకు దిగడాన్ని తాను కోరుకోనని చెప్పారు. ముస్లింలకు అన్యాయం జరిగితే… తాను వారి పక్షాన ఉంటానని తెలిపారు. హక్కుల కోసం జరిగే ఎలాంటి నిరసనలకైనా తాను మద్దతుగా ఉంటానని… అయితే, అవి రాజ్యాంగానికి లోబడి ఉండాలని అన్నారు. జిన్నా కోరుకున్న స్వాతంత్ర్యం తనకు అవసరం లేదని… భగత్ సింగ్ కోరుకున్న స్వాతంత్ర్యం అవసరమని చెప్పారు. సీఏఏపై భయాందోళనలను తొలగించాల్సిన అవసరం ఉందని బాబా రాందేవ్ అన్నారు. మనమంతా భారతీయులమని, దేశం నుంచి ముస్లింలను వెళ్లగొడతారనే ప్రచారంలో నిజం లేదని చెప్పారు. తాను ఓ గ్రామంలో జన్మించానని… కొన్ని తరాలుగా తన కుటుంబీకులకు బర్త్ సర్టిఫికెట్లు లేవని… అప్పట్లో వారికి వాటితో ఏం అవసరమని ప్రశ్నించారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/