కర్ణాటక శాసనసభ ప్రతిపక్ష నేత పోటీకి పాటిల్‌కే ఛాన్స్‌!

sonia ghandhi
sonia gandhi


న్యూఢిల్లీ: ఢిల్లీలో కాంగ్రెస్‌ నేతల సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులతో ఆ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీతో సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా పార్టీని మరింత బలోపేతం చేసే చర్యలపై సోనియా పలు సూచనలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు కర్ణాటకలో కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని పార్టీ అసమ్మతి నేతలే పడగొట్టడంపై సోనియా ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. కెపిసిసికి కొత్త అధ్యక్షుడు, జిల్లాలకు నూతన అధ్యక్షులు, శాసనసభ, విధాన పరిషత్‌లో ప్రతిపక్ష నేతల ఎంపిక వంటి వాటిపై సోనియా చర్చించే అవకాశం ఉంది. సమావేశంలో పాల్గొనేందుకు కెపిసిసి అధ్యక్షుడు దినేశ్‌ గుండూరావు, మాజీ సిఎం సిద్ధరామయ్య తదితరులు ఢిల్లీకి వెళ్లనున్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న లింగాయత్‌ నేత హెచ్‌కె పాటిల్‌ను శాసనసభలో ప్రతిపక్ష నేత పదవికి ఎంపిక చేసే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు మాజీ డిప్యూటీ సిఎం డిజి పరమేశ్వర్‌, మాజీ మంత్రి ఆర్‌వి దేశ్‌పాండేలు కూడా ప్రతిపక్ష నేత పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పాటిల్‌కే ఆ పదవి అప్పజెప్పాలని పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.. https://www.vaartha.com/news/national/