ఢిల్లీ చేరుకున్న అభినందన్‌ తల్లిదండ్రులు

న్యూఢిల్లీ: పాకిస్థాన్‌ అదుపులో ఉన్న భారత పైలెట్‌ అభినందన్‌ వర్దమాన్‌ను ఈరోజు విడుదల చేస్తామని పాక్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అభినందన్‌ తిరిగి స్వదేశానికి రానుండడం పట్ల దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈసందర్భంగా తమ బిడ్డను చూసేందుకు అభినందన్‌ తల్లిదండ్రులు విశ్రాంతి ఎయిర్‌ మార్షల్‌ ఎస్‌ వర్దమాన్‌, శోభా వర్దమాన్‌ సైతం నిన్న రాత్రి చెన్నై నుండి ఢిల్లీకి చేరుకున్నారు. అభినందన్‌‌ చూపిన ధైర్య సాహసాలకు మంత్రముగ్ధులయిన మిగతా ప్రయాణికులు.. కరతాళధ్వనుల మధ్య ఆయన తల్లిదండ్రులను విమానంలోకి ఆహ్వానించారు. గౌరవ సూచకంగా లేచి నిలబడి స్వాగతం పలికారు. వారితో ఫోటోలు తీసుకోవడానికి పోటీపడ్డారు.