కాల్వలో పడ్డ బస్సు…29 మంది మృతి

ఆగ్రా సమీపంలో ఘటన
16 మందికి గాయాలు
సీఎం యోగి దిగ్భ్రాంతి

Bus Skids Off Yamuna Expressway
Bus Skids Off Yamuna Expressway

లఖ్‌నవూ: ఈరోజు తెల్లవారుజామున లక్నో నుండి ఢిల్లీ వెళ్తున్న బస్సు కాల్వలోకి దూసుకెళ్లిన ఘటనలో 29 మంది దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన బస్సు యమున ఎక్స్‌ప్రెస్ వే పైనుంచి ప్రయాణిస్తుండగా ఆగ్రా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. అయితే అవధ్ బస్ డిపోకు చెందిన జన్‌రాత్ ఎక్స్‌ప్రెస్ రోడ్‌వే బస్సు కుబేర్‌పూర్ సమీపంలో అదుపుతప్పి ఝర్నా నాలాలోకి దూసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు. బస్సు 15 అడుగుల లోతున్న కాల్వలో పడిందని, 20 మందిని సురక్షితంగా రక్షించామని ఆగ్రా ఐజీ సతీశ్ గణేశ్ తెలిపారు. కాగా ఇప్పటి వరకు 27 మంది ప్రయాణికుల మృతదేహాలను వెలికి తీసినట్టు చెప్పారు. గాయపడిన మరో 16 మందిని ఆసుపత్రికి తరలించినట్టు తెలిపారు. ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అవసమైన వైద్య సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు యూపీ రోడ్డు రవాణా సంస్థ 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించింది.


తాజా ఇ పేపరు వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://epaper.vaartha.com/