శివసేనకు 26 మంది కార్పొరేటర్ల రాజీనామా!

uddhav thackeray
uddhav thackeray

ముంబయి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి. సీట్ల పంపకాలు కూడా జరిగి ప్రచారానికి వెళుతున్న సమయంలో పార్టీలో విభేదాలు తలెత్తాయి. బిజెపితో కలిసి పొత్తుతో వెళుతున్న శివసనలో వ్యతిరేకత మొదలయ్యింది. తూర్పు కల్యాణ్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి శివసేన పార్టీకి చెందిన 26 మంది కార్పొరేటర్లు ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు మరో 300 మంది పార్టీ కార్యకర్తలు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి రాజీనామా లేఖలను పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరేకు పంపించారు. కల్యాణ్‌ ఈస్ట్‌ నియోజవర్గం టికెట్‌ బిజెపికి అభ్యర్థికి కేటాయించడంతో ఈ నియోజకవర్గానికి చెందిన శివసేన కార్యకర్తలు తీవ్ర నిరసన తెలియజేవారు. వీరంతా రాజీనామా చేశారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాకరేకు పంపారు. రాజీనామా చేసిన వారిలో 16 మంది కల్యాణ్‌ డోంబీవాలి మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వారు కాగా, మరో 10 మంది ఉల్హాస్‌ నగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్పొరేటర్లుగా ఉన్నారు. తమ పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని పార్టీ చెబుతున్నప్పటికీ రెండు పార్టీలలోను అసంతృప్తి సెగలు తీవ్రంగానే ఉన్నాయి. పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే అంటే తమకు ఎంతో గౌరవమని అయితే ఇక్కడి నుంచి పోటీ చేసే బిజెపి అభ్యర్థికి తాము మద్దతు ఇవ్వలేమని రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్పష్టం చేశారు. మద్దతు ఇవ్వకుండా తమ అధినేతను ఇబ్బందులోకి నెట్టడం ఇష్టం లేకే తామంతా రాజీనామా చేసినట్లు కార్పొరేట్లు చెప్పారు. గత పదేళ్లుగా తమ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది లేదని, బిజెపి అభ్యర్థిని తాము ఆమోదించలేమని, అందుకే తాను స్వతంత్య్ర అభ్యర్థిగా పోటీచేయాలని భావిస్తున్నట్లు రెబెల్‌ అభ్యర్థి ధనంజ§్‌ు భదోరే చెప్పారు. బిజెపి అభ్యర్థులకు సహకరించి మద్దతు తెలపాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ థాక్రే చాలా సార్లు అభ్యర్థులను కోరారు. కానీ వారెవరూ ఆయన అభ్యర్థనను వినేలా లేరు. పొత్తులో భాగంగా టికెట్లు దక్కని వారు బాధపడకూడదని తనను క్షమించాలని కూడా ఆయన కోరారు. అంతేగాక బిజెపి అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కూడా పిలుపునిచ్చారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి 150 స్థానాల్లో పోటీ చేయనుండగా శివసేన 126 స్థానాల్లో పోటీ చేస్తున్నది. ఇతరులు 14 స్థానాల్లో పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు అక్టోబరు 21న జరుగనున్నాయి. ఫలితాలు అక్టోబర్‌ 24న వెలువడుతాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..https://www.vaartha.com/news/national/