హోటళ్లకు చనిపోయిన కోళ్ల‌ మాంసం సరఫరా

CHICIKEN
CHICIKEN

కోల్‌కత్తా: డంపింగ్‌యార్డుల్లో పడేసిన మాంసాన్ని తినుబండారాలు తయారీ సంస్థలకు సరఫరాచేస్తుండటంపై పశ్చిమబెంగాల్‌ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తుకు ఆదేశించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ పనికిరాని మాంసాన్ని హోటళ్లు తిరిగి వినియోగించడంపై తీవ్రనిరసన వ్యక్తం అయింది. ఇందుకోసం ప్రత్యేక దర్యాప్తు కమిటీ (సిట్‌)ను నియమించింది. ప్రభుత్వం ఒకేసారి గతవారంలో 20 టన్నుల వృధా మాంసాన్ని స్వాధీనంచేసుకుంది. ఈ మాంసం చనిపోయిన జంతవులనుంచి సేకరించినట్లు తేలింది. అంతేకాకుండా ఈ చనిపోయిన జంతువులను కమేళాలకు తరలిస్తారు. అక్కడినుంచి ఈ మాంసాన్ని చిన్నచిన్న హోటళ్లకు సరఫరాచేస్తున్నట్లు తేలింది. వీటిని పొరుగుననే ఉన్న జార్ఖండ్‌, ఒడిశా, బీహార్‌ రాష్ట్రాలకుసైతం సరఫరా చేస్తున్నట్లు తేలింది. ఈ భారీ సరఫరాలో పది మంది అనుమానతులను అదుపులోనికి తీసుకున్నారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుణ్ణిసైతం పోలీసులు అరెస్టుచేసారు. రాష్ట్ర ఎన్‌ఫోర్స్‌మెంట్‌బ్రాంచ్‌ ఈకుంభకోణంపై మరింత దర్యాప్తును చేపట్టింది. డైమండ్‌హార్బర్‌ ఎస్‌పి కోటేశ్వరరావు వివరాలప్రకారం అనేక బృందాలను గ్రేటర్‌ కోల్‌కత్తాలోను, పశ్చిమబెంగాల్‌ బయట ప్రాంతాల్లోను గాలింపుచర్యలకు నియమించామని, నిందితులను కనిపెట్టి అరెస్టుచేస్తామని అన్నారు. ఈ సంఘటనలో ప్రమేయంఉందని అనుమానిస్తున్న నిందితులకోసం అనేకప్రాంతాల్లో దాడులు నిర్వహించామని, జిల్లా మొత్తం అధికారులందరినీ అప్రమత్తంచేసామని, చనిపోయిన జంతువుల మాంసాన్ని విక్రయించే మాఫియాను పట్టుకునేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. కొందరు పొరుగురాష్ట్రాల్లోను, మరికొందరు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుంచి ఈ వ్యాపారంచేస్తున్నారని, మొత్తం చైన్‌ మాఫియాను అదుపులోనికి తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఇదొక సమిష్టిరాకెట్‌గా నడుస్తోందని అన్నారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాల విభాగం సమగ్ర నివేదికను కోరింది. ఆశాఖ మంత్రి సాధన్‌పాండేమాట్లాడుతూ సమగ్ర నివేదికను కోరామని, రాగానే ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి అందచేస్తామని వెల్లడించారు. పశ్చిమబెంగాల్‌ప్రభుత్వం అన్ని పోలీస్‌ స్టేషన్లను అన్ని జిల్లాలను, అన్ని మెట్రోపాలిటన్‌ నగరాల్లో ఇలాంటి విక్రయాలపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశించింది.