శ‌శి థ‌రూర్‌కు ఊర‌ట‌

Shashi Tharoor
Shashi Tharoor

న్యూఢిల్లీ : సునంద పుష్కర్‌ హత్య కేసులో విచారణను ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ ఎంపి శశి థరూర్‌ జెనీవా వెళ్లేందుకు ఢిల్లీ కోర్టు సోమవారం అనుమతినిచ్చింది. ఇటీవల కన్నుమూసిన ఐక్యరాజ్యసమితి మాజీ సెక్రటరీ కోఫీ అన్నన్‌ కుటుంబానికి సంతాపాన్ని తెలియజేయడానికి, వరదల్లో కొట్టుమిట్టాడుతున్న కేరళ కోసం అంతర్జాతీయ నిధి సేకరణ కోసం జెనీవా వెళుతున్నట్లు ఆయన తరుపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. కోఫిఅన్నన్‌కు మెంటార్‌గా శశిథరూర్‌ పదేళ్ల పాటు వ్యవహరించారని వారు తెలిపారు. దీంతో శశిథరూర్‌ విదేశీ ప్రయాణానికి అనుమతినిస్తూ అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ సమర్‌ విశాల్‌ తీర్పునిచ్చారు. ‘ మీ దరఖాన్తును పరిశీలించాను. ప్రయాణ షెడ్యూల్‌ గురించి దర్యాప్తు అధికారి తెలిజేయాలి’ అని జడ్జి పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం విదేశాలకు వెళ్లనున్నారని, తిరిగి మంగళవారం భారత్‌కు బయలుదేరుతారని న్యాయవాది కోర్టుకు తెలిపారు. 2014, జనవరిలో ఒక లగ్జరీ హోటల్‌లో శశిథరూర్‌ భార్య సునంద పుష్కర్‌ మృతి చెందగా, ఈ కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్న విష‌యం విదితం.