రాహుల్‌ నామినేషన్‌కు హాజరైన టిపిసిసి నేతలు

Rahul Gandhi
Rahul Gandhi

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్‌గాంధీ నామినేషన్‌ వేసే కార్యక్రమానికి తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు హాజరైయ్యారు. సోమవారం టిపిసిసి అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో టిపిసిసి పక్షాన రాహుల్‌గాంధీ అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. ఒక్కొక్క సెట్‌లో పది చొప్పున మద్దతు తెలిపుతూ నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు. ఒక సెట్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేయగా, మరోసెట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భట్టివిక్రమార్క, మూడవ సెట్‌ గద్వాల ఎమ్మెల్యే డికె అరుణ దాఖలు చేశారు. ఈసందర్భంగా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతూ రాహుల్‌గాంధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షబాధ్యతలు చేపట్టాలని యావత్తు భారతదేశం ఎంతో ఆశగా ఎదురు చేస్తోందన్నారు. రాహుల్‌ నాయకత్వంలో దేశంలోనూ, రాష్ట్రంలోనూ కాంగ్రెస్‌ పార్టీ అధికార పగ్గాలు చేపట్టడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల ఆశయం, ఆకాంక్షలు నెరవేరాలంటే కాంగ్రెస్‌ పార్టీతోనే సాధ్యమని, ఆ దిశగా సామాజిక తెలంగాణను నిర్మిస్తామని స్పష్టం  చేశారు. ఈ కార్యక్రమంలో మండలి విపక్షనేత షబ్బీర్‌అలీ, తెలంగాణ ప్రదేశ్‌ రిటర్నింగ్‌ అధికారిని దీపాదాస్‌ మున్షీ, మాజీ టిపిసిసి అధ్యక్షులు వి.హనుమంతరావు,  పొన్నాల లక్ష్మయ్య,మాజీ కేంద్ర మంత్రులు సర్వే సత్యనారాయణ, బలరాంనాయక్‌, రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనందబాస్కర్‌, ఎంపి నంది ఎల్లయ్య, మాజీ
ఎంపిలు పొన్నం ప్రభాకర్‌, మధుయాష్కీ, పిఎసి చైర్మన్‌ గీతారెడ్డి, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి, దొంతి మాదవరెడ్డి, ఎమ్మెల్సీ పొంగులేటి  సుధాకర్‌రెడ్డి,మాజీ మంత్రి మర్రిశశిధర్‌రెడ్డి టిపిసిసి ఉపాధ్యక్షులు మల్లురవి, వేణుగోపాల్‌రావు తదితరులు పాల్గొని సంతకాలు చేశారు.