రాత్రి వేళ‌ల్లో ఏటిఎంలో నగదు నింపొద్దు

ATM
ATM

దిల్లీ: దేశంలో పలు ఏటిఎం కేంద్రాలలో నగదు నింపేందుకు వెళ్లే వాహనాలపై దాడుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాత్రి 9గంటలు దాటిన అనంతరం ఏటిఎం కేంద్రాలలో నగదు నింపొద్దని బ్యాంకింగ్‌ అధికారులకు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు నగరాల్లో నగదును రవాణా చేసే వాహనాలు ప్రైవేటు ఏజెన్సీలు ఉదయాన్నే డబ్బును బ్యాంకుల నుంచి తీసుకెళ్లాలని అధికారులు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనైతే సాయంత్రం 6గంటలు, నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలో సాయంత్రం 4గంటల్లోగా నగదు ఏటిఎం కేంద్రాలలో నింపేందుకు గడువు విధించనుంది. సిసి కెమెరాలు, జిపిఎస్‌ సౌకర్యం ఉన్న ప్రత్యేక వాహనాల్లో ఒకదపాలో రూ.5కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని తీసుకెళ్లోద్దని సూచించింది. ఈ ప్రతిపాదనను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చేసింది. ఈ ప్రతిపాదనను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ పరిశీలనకు పంపింది. దీనిపై ఆమోదం లభించాక అమలు కోసం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు ఓ అధికారి తెలిపారు. సుశిక్షితులైన ఇద్దరు సాయుధ జవాన్లతో పాటు ఓ వ్యాన్‌ డ్రైవర్‌ ఉండాలని, ఎప్పుడైనా దాడి జరిగిన నేపథ్యంలో సురక్షితంగా తీసుకెళ్లాలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా ప్రైవేటు ఏజెన్సీలను ఆదేశించింది. దేశ వ్యాప్తంగా సుమారు 8,000 ప్రైవేటు వాహనాలు రోజు రూ.15వేల కోట్లను బ్యాంకుల నుంచి ఏటిఎంలు, ఇతర కేంద్రాలకు రవాణా చేస్తున్నాయి.