రాజ్య‌స‌భ ఎన్నిక‌ల కౌంటింగ్ ప్రారంభం

Parliament image copy
Parliament

ముంబై: 58 రాజ్యసభ స్థానాలకు జరిగిన రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 33 మంది అభ్యర్థులు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తక్కిన 25 స్థానాలకు గాను ఆరు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగియడంతో సాయంత్రం ఐదు గంటలకు ఓట్ల లెక్కింపు మొదలైంది. మరికొద్ది గంటల్లోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. వచ్చే నెలలో బీజేపీకి చెందిన 17, కాంగ్రెస్‌కు చెందిన 12 ఖాళీలు ఏర్పడుతున్నాయి. నామినేట్ సభ్యులైన రేఖ, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సామాజిక కార్యకర్త అనూ ఆగా ఏప్రిల్‌లో రిటైరవుతున్నారు. కాగా, రాజ్యసభ ఎన్నికల్లో 18 మంది అభ్యర్థులను బీజేపీ నిలిపింది. వీరిలో బీజేపీ జాతీయ మీడియా హెడ్ అనిల్ బలుని, బీజేపీ ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండే కూడా ఉన్నారు. కేద్ర మంత్రి జేపీ నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి రాజ్యసభకు పోటీ చేయగా, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ యూపీ నుంచి, న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బీహార్ నుంచి పోటీ చేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, థావర్ చంద్ గెహ్లాట్, మరో మంత్రి మన్‌సుఖ్ ఎల్.మాండవీయ, పర్సోత్తమ్ రూపాల కూడా రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అభిషేక్ మను సింఘ్వి పశ్చిమబెంగాల్ నుంచి పోటీచేస్తుండగా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన మద్దతు ఇప్పటికే ప్రకటించారు. యూపీలో 8 మందిని రాజ్యసభకు పంపేందుకు అవసరమైన బలం బీజేపీకి ఉండగా ఆ పార్టీ వ్యూహాత్మకంగా తొమ్మిదో అభ్యర్థిని కూడా బరిలోకి దింపడంతో ఉత్కంఠ నెలకొంది. బీఎస్‌పీ అభ్యర్థిని అడ్డుకోవడమే బీజేపీ వ్యూహంగా చెబుతున్నా, అదే జరిగితే దళితులకు బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ఎండగట్టేందుకు దీన్ని ప్రచారాస్త్రంగా బీఎస్‌పీ అధినేత్ర మాయావతి వాడుకునే అవకాశం ఉందంటున్నారు.