రాజీవ్‌ హత్య కేసు : నళినికి పెరోల్‌ మంజూరు

NALINI
హైదరాబాద్‌ : దివంగత ప్రధాన మంత్రి రాజీవ్‌ గాంధీ హంతకురాలు నళిని శ్రీహరన్‌కు మద్రాస్‌ హైకోర్టు పెరోల్‌ మంజూరు చేసింది. గత నెలలో ఆమె తండ్రి మరణించడంతో ఒక రోజు పెరోల్‌ ఇచ్చారు. ఇప్పుడు తండ్రి ఖర్మకాండలు నిర్వహించేందుకు ఒక రోజు పెరోల్‌ మంజూరు చేశారు. తమిళనాడులోని పెరంబదూరులో 1991మే 21న అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీని హత్య గావించిన విషయం విధితమే. రాజీవ్‌ హంతకులలో ముగ్గరు మురుగన్‌, పెరారివాలన్‌, శాంతన్‌, నళిని, రాబర్ట్‌పయన్‌, రవిచంద్రన్‌ మొత్తం ఏడుగురు తమిళనాడు జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. వారు ఇప్పటికి 24 సంవత్సరాలుగా శిక్ష అనుభవిస్తున్నారు. దీంతో వారిని విడుదల చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆధ్వర్యంలో మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌గాంధీ హత్య అనేది దేశంపై జరిగిన దాడిగా గతంలో కేంద్రంలో ఉన్న యూపిఏ ప్రభుత్వం పేర్కొంది. ఆ హంతకులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడుదల చేయవద్దని తమిళనాడులోని అన్నా డిఎంకె ప్రభుత్వానికి అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ సూచించారు. వారిని విడుదల చేయడం అన్ని రకాల సిద్దాంతాలకు వ్యతిరేకమని, న్యాయపరంగా ఆమోదయోగ్యంకాదని తెలిపారు. ఏ ప్రభుత్వమైనా, ఏ పార్టీ అయినా ఉగ్రవాదంపై పోరు విషయంలో మెతకవైఖరి అవలంభించకూడదని తెలిపారు. జయలలిత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కేంద్రం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అత్యున్నత న్యాయస్థానం హంతకుల విడుదలను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా వారు జైల్లోనే ఉండాల్సిందేనని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పుడు తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో వారిని విడుదల చేయించాలని అక్కడి రాజకీయ పార్టీలు కృషి చేస్తున్నాయి. వారిని విడుదల చేయించడం ద్వారా తమిళనాట చాలా ఓట్లు వచ్చే అవకాశం ఉంది.