భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వంపై చైనా వ్యతిరేకత

వియన్నా : అణుసరఫరా కూటమి దేశాల్లో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడంద్వారా అణునిరాయుధీకరణ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడమేనని చైనా భావిస్తోంది. 48 దేశాల అణుసరఫరా దేశాల కూటమిలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని అగ్రదేశం చైనా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ అంశంపై అమెరికాపై కూడా వత్తిడితెచ్చేందుకు యత్నిస్తోంది. ఇతరత్రా భారత్‌ సభ్యత్వాన్ని వ్యతిరేకిస్తున్న దేశాల్లో న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌, టర్కీ, దక్షిణాఫ్రికా, ఆస్రియావంటి దేశాలున్నాయి. వియన్నాలో జరిగిన కూటమి సమావేశంలో 48 దేశాల కూటమి ఎన్‌ఎస్‌జి అణ్వాయుధాల వ్యాప్తిని నిరోధించాలని, అణ్వాయుద వినియోగంపై ఆంక్షలు విధించడం, అణు అణ్వాయుధాల అమ్మకం, ఇతరత్రా ఆయుధాల తయారీకి వినియోగించడంపై ఆంక్షలు విధించడం వంటి లక్ష్యాలతో కూటమి ఆవిర్భవించింది. భారత్‌కుసభ్యత్వం ఇవ్వడమంటే అణువ్యాప్తిని నిరోధించడాన్ని అణిచివేస్తున్నట్లేనని కూటమి దేశాలు కొన్ని వ్యాఖ్యానించాయి. పొరుగుననే ఉన్న చైనాకుకూడా ముప్పు ఉంటుందని, ఇప్పటికే చైనాతో కలిసి పాకిస్తాన్‌ భారత్‌కు సభ్యత్వం ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తోందని చెపుతున్నారు. ఈనెల 20వ తేదీ సియోల్‌లో జరిగే ప్లీనరీ ఎన్‌ఎస్‌జి సమావేశంలో చర్చకు రాకపోవచ్చని నిర్ణయం కూడా తీసుకునే అవకాశం లేదని ఒకదేశ ప్రతినిధి వివరించారు. గురు వారంనాడు నిర్వహించిన సమావేశంలో భారత్‌కు సభ్యత్వం ఇవ్వడం పై ప్రతిపక్షం ఎంత పటిష్టంగా ఉందన్న అంశంపై చర్చలు జరిగినట్లు సమాచారం. అమెరికా విదేశాంగశాఖ మంత్రి జాన్‌కెర్రీ ఈమేరకు సభ్యదేశాలకు లేఖలు రాస్తూ భారత్‌కు సభ్యత్వం ఇవ్వడంపై ఆంక్షలు పెట్టవద్దని కోరారు. పాకిస్తాన్‌కు ఎన్‌ఎస్‌జిలో సభ్యత్వం ఇచ్చేంత వరకూ భారత్‌కు సభ్యత్వం ఇవ్వడంపై చైనా తీవ్ర వ్యతిరేకిస్తుందన్న భావన వ్యక్తం అవుతోంది. చైనావైఖరే భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వంలో కీలకం అవుతుంది. ఇక తాజాగా అమెరికా, ఐవరీకోస్ట్‌, మెక్సికో దేశాలు భారత్‌కు ఎన్‌ఎస్‌జి సభ్యత్వం ఇవ్వడాన్ని మద్దతునిస్తున్నాయి. ఒకవేళ భారత్‌కు అనుమతినిస్తే అదే విధానం అన్ని దేశాలకు అమలుచేయాలనే వాదన తెరపైకి తెస్తున్నారు. ప్రత్యేకించి చైనా, పాకి స్తాన్‌లు ఈ వాదనను లేవనెత్తినట్లు తెలిసింది.