బిజెపి మేనిఫెస్టో కమిటీకి ఛైర్మన్‌గా రాజ్‌నాధ్‌

rajnath singh
rajnath singh

పబ్లిసిటీ కమిటీకి అరుణ్‌జైట్లీ
న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి రాజ్‌నాధ్‌సింగ్‌ వచ్చే సార్వత్రిక ఎన్నికలకోసం బిజెపి మేనిఫెస్టోకమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఆర్ధిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రచార ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికలకు భారతీయ జనతాపార్టీ ఇప్పటినుంచే సర్వహంగులు సమకూర్చుకునేందుకు విస్తృత స్థాయిలో కసరత్తులుచేస్తోంది. ఇప్పటినుంచే వివిధ విభాగాలకు ఇన్‌ఛార్జిలను నియమిస్తోంది. బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా సార్వత్రిక ఎన్నికలకోసం మొత్తం 17 గ్రూపులను ఏర్పాటుచేసారు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ మీడియా ప్యానెల్‌ను పర్యవేక్షిస్తారు. షానవాజ్‌ హుస్సేన్‌, మీనాక్షిలేఖి వంటి ఇతర పార్టీ నేతలు కూడా ఈ ప్యానెల్‌లో ఉంటారు. రవాణా మంత్రి నితిన్‌ గడ్కరీ సోషలహమీడియా ప్యానెల్‌కు నాయకత్వం వహిస్తారు. అలాగే వలంటీర్ల సంఘాలను సైతం పర్యవేక్షిస్తారు. ఇక ఎన్నికల ప్రచారానికి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు ర్యాలీలు, ప్రముఖుల బహిరంగసభలకు తాజా సమాచారాన్ని సేకరించి అందించే విభాగానికి విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ నాయకత్వం వహిస్తారు. లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జిగా ఐదు రాష్ట్రాలకు ఉత్తరప్రదేశ్‌ను కూడా అప్పగిస్తూ కేంద్ర ఆరోగ్యమంత్రి జెపి నడ్డాకు అప్పగించిన అమిత్‌షా, ఢిల్లీని రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. లోక్‌సభ ఎన్నికలు ఈ ఏడాది ఏప్రిల్‌ లేదా మేనెలల్లో జరుగుతాయి.