ప్రాణానికి ముప్పుగా ప‌రిణ‌మించిన సెల్ఫీ స‌ర‌దా

Selfie with anaconda
Selfie with anaconda

కలకత్తా: గ్రామ సమీపంలోకి వచ్చిన కొండచిలువను పట్టుకొని అడవిలో వదిలేయకుండా సెల్ఫీ దిగుదామని సంబరపడ్డారు. అనుకున్నదే అదనుగా భారీ గుంపుతో చేరి సెల్ఫీలు దిగుతున్నారు. ఇంతలో ఆ పాము ఓ వ్యక్తి మెడను చుట్టేసింది. కొద్దిలో ఆయన ప్రాణాలు గాల్లో కలిసేవే. అయితే అక్కడే ఉన్న మరో అధికారి దీన్ని గమనించి మెడకు పూర్తిగా చుట్టుకోకుండా ఆపగలిగాడు. లేదంటే క్షణకాలంలో ఆ ప్రాంతంలో విషాదం మిగిలేది. ఇంతకీ విషయమేంటంటే.. పశ్చిమ్‌బంగాలోని జల్పైగురి అనే గ్రామంలోకి వచ్చిన ఓ కొండచిలువ మేకను చంపి తినేందుకు ప్రయత్నిస్తుంటే అక్కడి గ్రామస్థులు చూశారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. తన బృందంతో కలిసి అక్కడికి చేరుకున్న సంజయ్ దత్ అనే అటవీ శాఖ అధికారి దాన్ని పట్టుకున్నాడు. అయితే ఆ తర్వాతే జరిగిన సంఘటనే చర్చనీయాంశమైంది. వారు పట్టుకున్న కొండచిలువను అడవిలో వదిలేయకుండా, దానితో సెల్ఫీ దిగుదామని అక్కడున్నవారు ముచ్చటపడ్డారు. దీనికి సంజయ్ కూడా సరేనని ఒప్పుకున్నాడు. ఒక చేత్తో పామును పట్టుకొని, మరో చేత్తో సెల్ఫీ తీస్తున్నాడు. ఈ క్రమంలో ఆయనను మెడను పూర్తిగా చుట్టేయడానికి వచ్చింది కొండ చిలువ. ఊపిరి ఆడలేక సంజయ్ పరుగులు పెట్టాడు. ఈ విషయం గమనించిన మరో వ్యక్తి దాని తోకను గట్టిగా పట్టుకొని మెడను చుట్టేయకుండా అడ్డుకోగలిగాడు. బతుకు జీవుడా అనుకున్న సంజయ్ దాన్ని బైకాంథపూర్‌ అటవీ ప్రాంతంలో వదిలేశాడు. పెద్ద ప్రమాదమే తప్పింది అనుకొని అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు.