పాన్‌తో ఆధార్‌ లింక్‌ లేకుంటే పాన్‌ రద్దు

sushil chandra
sushil chandra

సిబిడిటిఛైర్మన్‌ సుశీల్‌చంద్ర
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలులో పాన్‌కార్డు, ఆధార్‌ లింకుచేయనిపక్షంలో తాము పాన్‌కార్డునుసైతం అవసరమైతే రద్దుచేస్తామని సిబిడిటిఛైర్మన్‌ సుశీల్‌ చంద్ర పేర్కొన్నారు. ఇప్పటివరకూ దేశంలో 23 కోట్ల పాన్‌కార్డులు ఆధార్‌తో లింక్‌ అయ్యాయని పేర్కొన్నారు. ఆధార్‌పాన్‌కార్డు నంబర్ల లింకింగ్‌కు గడువు వచ్చే మార్చి 31వ తేదీతో ముగుస్తుండటంతో సిబిడిటిఛైర్మన్‌రానున్న ముప్పును ముందే హెచ్చరించారు. బయోమెట్రిక్‌ ఐడి ఆధార్‌ను పాన్‌కార్డుతో తక్షణమే లింక్‌చేయాలని కోరారు. ఐటిశాఖ ఇప్పటివరకూ 42 కోట్ల పాన్‌ నెంబర్లను జారీచేసిందని, వీటిలో 23 కోట్ల పాన్‌కార్డులు మాత్రమే లింక్‌ అయ్యాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదాయపు పన్ను రిటర్నుల్లో విధిగా ఆధార్‌ను పాన్‌తో లింక్‌చేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. వచ్చే మార్చి 31వ తేదీలోపు లింక్‌చేసుకోవాలని, దీనివల్ల డూప్లికేట్‌ కార్డులు ఉంటే వెలుగులోనికి వస్తాయని పేర్కొన్నారు. డూప్లికేట్‌ పాన్‌కార్డు ఉంటే ఖచ్చితంగా లింక్‌చేయరని, అటువంటి సమయంలో ఆకార్డులను రద్దుచేస్తానని పేర్కొన్నారు. అసోచామ్‌ సదస్సులో పాల్గొన్న సుశీల్‌చంద్ర పాన్‌ ఆధార్‌ లింకింగ్‌ తప్పనిసరి అని పేర్కొన్నారు. అలాగే ఆధార్‌ను బ్యాంకు ఖాతాలు, టెలికామ్‌ సేవల కంపెనీలతో లింకింగ్‌ అన్నది నిర్బంధం కాదన్నది తెలిసిందే. ఆధార్‌ను పాన్‌కార్డుతో లింక్‌చేస్తే పాన్‌కార్డును బ్యాంకు ఖాతాతో లింక్‌ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఐటిశాఖ అస్సెస్సీల వ్యయం వివరాలను తెలుసుకునేందుకు వీలవుతుందని అన్నారు. అంతేకాకుండా ఈ లింకింగ్‌ వల్ల సంక్షేమపథకాలు అర్హులైన వ్యక్తులకు అందుతున్నాయా లేదా అన్నది కూడా తెలుసుకునే వీలుంటుందన్నారు. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్‌ 139 ఎఎ(2) ప్రకారంచూస్తే ప్రతి వ్యక్తి 2017 జులై ఒకటవ తేదీనాటికి పాన్‌ ఉండాలని నిర్దేశిస్తోందని అన్నారు. లేనివారు విధిగా ఆధార్‌నంబరును పన్నులశాఖకు తెలియజేయాల్సి ఉంటుందని అన్నారు. ఇప్పటివరకూ ఈ ఏడాది 6.31 కోట్ల రిటర్నులు దాఖలయ్యాయని, గత ఏడాది దాఖలైన 5.44 కోట్లకంటే ఎక్కువ వచ్చాయన్నారు. ఇప్పటివరకూ 95 లక్షల మంది కొత్త పన్ను చెల్లింపుదారులు అసెస్‌మెంట్లను దాఖలుచేసారన్నారు. ఈఆర్ధికసంవత్సరంలో ఎక్కువగా పన్నురిటర్నులు దాఖలుచేయని వారిని గుర్తించామని, థర్డ్‌ పార్టీ సమాచారంతో వారి రిటర్నులను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. వారు రిటర్నుల్లో వాస్తవ ఆదాయవనరులను చూపించారా లేదా అన్నది బేరీజువేస్తున్నట్లు వెల్లడించారు. నాన్‌ఫైలర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(ఎన్‌ఎంఎస్‌) కింద ఎక్కువ విలువలున్న లావాదేవీలు కొనసాగించిన వ్యక్తులు వారి ఐటి రిటర్నులను దాఖలుచేయకపోయినా, ఐటిశాఖ వారిని హెచ్చరించి 21రోజుల గడువుతో దాఖలుచేయాలని ఆదేశిస్తున్నట్లు వెల్లడించారు. గతనెలనుంచే ఎన్‌ఎంఎస్‌ వ్యవస్థను కొనసాగించామని, 15రోజుల్లో 33వేలమందికిపైగా పనున చెల్లింపుదారులు స్పందించారని అన్నారు. విదేశీ జమలు పదిలక్షలు జమచేసి రిటర్నుల్లో దాఖలుచేయకపోయినా, రూ.30లక్షల విలుఐన ఆస్తిని కొనుగోలుచేసి రిటర్నులు దాఖలుచేయకపోయినా వారిని గుర్తించి రిటర్నులు దాఖలుచేయాలని గడువు ఇస్తున్నట్లు సుశీల్‌చంద్ర పేర్కొన్నారు. 15 రోజుల్లోనే మూడులక్షలకుపైగా ఇఫైలింగ్‌ వెబ్‌సైట్‌ను వీక్షించారని, 33వేల మంది ఇప్పటికే రిటర్నులు దాఖలుచేసారన్నారు. 125కోట్ల జనాభా ఉన్న దేశంలో ఆర్ధికవృద్ధి 7.5శాతంగా ఉందని, కేవలం 1.5 లక్షల రిటర్నులు మాత్రమే కోటి రూపాయలకుపైబడిన ఆదాయం ఉన్నట్లు చూపిస్తున్నాయని పేర్కొన్నారు. జిడిపి, వినియోగ వ్యయం, వినియోగంపెరుగుతున్న దశలో ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌ భర్తీ అవుతున్నపుడు ఎంతమంది కోటికిపైబడిన సంపన్నులు రిటర్నులు దాఖలుచేస్తున్నారని ప్రశ్నిస్తే కేవలం 1.5 లక్షలమంది మాత్రమే రిటర్నులు దాఖలుచేయడం శోచనీయమన్నారు. 2013-14లో 88వేలు మాత్రమే ఉందని, ఆసంఖ్య ఇపుడు 1.5 లక్షలకు చేరిందని పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్న ఆస్తుల వివరాలను పొందుపరచని రిటర్నులను సైతం పట్టుకుంటున్నట్లు వెల్లడించారు. కామన్‌ రిపోర్టింగ్‌ స్టాండర్డ్‌ వ్యవస్థను అనుసరించి వారి విదేశీ ఆస్తులుసైతం ఐటిఆర్‌లలో ఉన్నదీలేనిదీ తెలుసుకుంటున్నట్లు వెల్లడించారు. ఇక నల్లధనం చట్టం పరంగాచూస్తే విదేశీ ఆస్తులను వెల్లడించనిపక్షంలో మూడేళ్ల జైలుశిక్షార్హులవుతారన్నారు. స్థిరాస్తి ఆదాయం రూపంలో కానీ, మరే ఇతర రూపంలో కానీ ఉన్నట్లయితే ఏడేళ్లపాటు జైలుశిక్ష పడే అవకాశం ఉందన్నారు. పన్నుచెల్లింపుదారులు సకాలంలో పన్నులుచెల్లించాలని, పన్ను ఎగవేతదారులకు ఇక కష్టకాలమే ముందుంటుందని సిబిడిటిఛైర్మన్‌ హెచ్చరించారు.