పండిట్ ర‌విశంక‌ర్‌ను జోక‌ర్‌గా వ‌ర్ణించిన ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ

asaduddin
asaduddin

ఢిల్లీః ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్య‌వ‌స్థాప‌కుడు పండిట్ ర‌విశంక‌ర్‌పై తీవ్రంగా మండిప‌డ్డారు ఎంఐఎం ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ, అయోధ్య సమస్య పరిష్కారానికి తాను మధ్యవర్తిత్వం వహిస్తానన్న పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్ ఆఫర్‌ను తిరస్కరించారు. ఆయన మధ్యవర్తిత్వం ఓ జోక్ అని, ఈ విషయంలో ఆయనకు ఎలాంటి అధికారం లేదని స్పష్టంచేశారు. ఈ సందర్భంగా రవిశంకర్‌ను ఓ జోకర్‌గా అసద్ అభివర్ణించారు. మొఘల్ అన్న పదం సరిగ్గా పలకడానికి రానివారు కూడా వాళ్లకు సన్నిహితులమని చెప్పుకుంటున్నారని ఒవైసీ ఆరోపించారు. ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా ఇప్పటికే రవిశంకర్ ఆఫర్‌ను తిరస్కరించిందని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. ముందు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ విధించిన జరిమానాను కట్టండి అంటూ రవిశంకర్‌కు అసద్ చురకంటించారు. అయోధ్య అంశంలో మధ్యవర్తిత్వం వహిస్తానన్న ఆయన ప్రకటనకు నోబెల్ బహుమతి ఏమీ రాదని ఆయ‌న ఎద్దేవా చేశారు.