నేడు దక్షిణాది కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశం

kodanda reddy
kodanda reddy

కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి
హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ రైతు సమస్యలపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించనుంది. మంగళవారం ఇక్కడి గాంధీభవన్‌లో దక్షిణాది కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల కిసాన్‌ కాంగ్రెస్‌ నాయకులు హాజరు కానున్నారు. ఏఐసిసి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత కిసాన్‌ కాంగ్రెస్‌ సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి సోమవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. రైతులకు ఏ విధమైన మేలు చేయాలనే విషయంపై రాహుల్‌ దృష్టి సారించారనీ, వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కిసాన్‌ కాంగ్రెస్‌కు బాధ్యతలు అప్పజెప్పారని స్పష్టం చేశారు. ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చిన మోడీ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదనీ, ఫసల్‌ బీమా యోజనలో మార్పులు చేశారు కానీ, ఇన్సూరెన్స్‌ విషయంలో ప్రైవేటు కంపెనీలకు అప్పజెప్పారని విమర్శించారు. యూపీఎ అధికారంలో ఉన్నప్పుడు పంటకాలం అంచనా వేసే వారనీ, దానివల్ల రైతు కష్టనష్టాలపై అంచనా ఉండేదని పేర్కొన్నారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వ హయాంలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోయాయని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టంతో రైతులకు అన్యాయమే జరుగుతున్నదనీ, ఇది రైతులకు ఏ విధంగానూ లాభదాయకం కాదన్నారు. ఈ విషయాలన్నీ నేటి సమావేశంలో చర్చకు వస్తాయన్నారు. కొత్త పాస్‌ పుస్తకం కోసం తహశీల్దార్‌ రూ.లక్ష లంచం అడిగారని రైతు కుటుంబం బజార్లో బిక్షం ఎత్తుకుంటున్నారనీ, ఇది రాష్ట్రంలో రైతుల పరిస్థితికి అద్దం పడుతున్నదని కోదండరెడ్డి పేర్కొన్నారు.