నేడు చెన్నైలో ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ర్య‌ట‌న‌….

venkaiah naidu
venkaiah naidu

చెన్నై: ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక్క రోజు పర్యటన నిమిత్తం ఈ రోజు చెన్నై వస్తున్నారు. నగరంలో జరిగే భారతీయార్‌ పురస్కార ప్రదానోత్సవం, వెటర్నరీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవాల్లో ఆయన పాల్గొంటారు. ఉపరాష్ట్రపతి రాకను పురస్కరించుకుని పోలీసు అధికారులు భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. వానవిల్‌ పన్బాట్టు మయ్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తమిళ మహాకవి జయంతి వేడుకలలో భాగంగా మైలాపూరు భారతీయ విద్యాభవన్‌లో భారతి అవార్డు ప్రదానోత్సవం జరుగనుంది. ఈ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు పాల్గొని సీబీఐ మాజీ డైరెక్టర్‌ కార్తికేయన్‌కు అవార్డును ప్రదానం చేసి ప్రసంగించనున్నారు. ఆ తర్వాత ఆయన స్థానిక వేప్పేరిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సంలో పాల్గొని హరితవిప్లవ పితామహుడు, ప్రముఖ శాస్తవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు ప్రత్యేక అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం వెంకయ్యనాయుడు ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో చెన్నైకి రానున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా మైలాపూరు భారతీయ విద్యాభవన్‌కు వెళతారు. అక్కడి కార్యక్రమాలను ముగించుకుని వెటర్నరీ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో పాల్గొంటారు. ఉప రాష్ట్రపతి పర్యటనను పురస్కరిం చుకుని మీనంబాక్కం విమానాశ్రయం నుంచి మైలాపూరు వరకు, అక్కడి నుంచి వేప్పేరిలోని వెటర్నరీ విశ్వవిద్యాలయం వరకు పోలీసులు గట్టిభద్రతా ఏర్పాట్లు చేప‌ట్టారు.