నళిని చిదంబరంపై సిబిఐ ఛార్జిషీటు

nalini chidambaram
nalini chidambaram

న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం సతీమణి నళినీ చిదంబరంపై సిబిఐ శారదా చిట్‌ఫండ్‌ కేసుకు సంబంధించి ఛార్జిషీటును దాఖలుచేసింది. శారదాగ్రూప్‌ కంపెనీలనుంచి ఆమె రూ.1.4కోట్లు సొమ్మును తీసుకున్నారని, చిట్‌ఫండ్‌కుంభకోణం కేసు నుంచి సుదీప్తసేన్‌ను బైటపడేసేందుకుగాను ఈ మొత్తం స్వీకరించినట్లు సిబిఐ ఆరోపించింది. శారదాసంస్థ అధిపతి సుదీప్తాసేన్‌తో ఆమె నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని, ఇతర నిందితులు కూడా శారదాగ్రూప్‌కంపెనీల నిధులను దుర్వినియోగంచేసేందుకు కైంకర్యంచేసేందుకు ప్రయత్నించారని సిబిఐ ప్రతినిది అభిషేక్‌ దయాల్‌ వెల్లడించారు. కేంద్ర మాజీ మంత్రి మాతంగ్‌ సింహ్‌ మాజీ భార్య మనోరంజనా సింహ్‌ సుదీప్తసేన్‌ను నళిని చిదంబరానికి పరిచయం చేసారని, సెబీ, ఆర్‌ఒసి వంటి సంస్థలు చేస్తున్న దర్యాప్తులనుంచి ఆయన్ను కాపాడేందుకుగాను నళిని 1.4 కోట్ల రూపాయలు సొమ్ములు పొందారని 2010-12 సంవత్సరాలమధ్యకాలంలో ఈ తతంగం నడిచిందని అన్నారు. కోల్‌కత్తాలోని సిబిఐ ప్రత్యేకకోర్టులో ఛార్జిషీటును దాఖలుచేసినట్లు ప్రతినిధి వెల్లడించారు. శారదా గ్రూప్‌ రూ.2500 కోట్లు ప్రజలనుంచి అత్యధిక వడ్డీ ఇస్తామన్న ఆశచూపించి సేకరించిందని అయితే ఆ మొత్తాన్ని తిరిగి ఇవ్వలేదని సిబిఐ కేసులునమోదుచేసింది. కంపెనీ కార్యకలాపాలను సేన్‌ 2013లోనే మూసివేసారు. దీనితో ప్రజలనుంచి వసూలుచేసిన సొమ్మును తిరిగి చెల్లించలేదు. శారదా కుంభకోణానికి సంబంధించి సిబిఐ వరుసగా ఆరవ ఛార్జిసీటును దాఖలుచేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు 2014లో శారదా కేసును సిబిఐ దర్యాప్తుచేపట్టింది.