తొలిసారి రాష్ట్ర‌ప‌తి విదేశీ ప‌ర్య‌ట‌న‌

Ramnath Kovind
Ramnath Kovind

న్యూఢిల్లీః రాష్ట్ర‌ప‌తిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌ర్వాత త‌న మొద‌టి విదేశీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఆఫ్రికా ఖండంలోని డ్జిబౌతీ, ఇథియోపియా దేశాల‌కు బ‌యల్దేరారు. ఈ ప‌ర్య‌ట‌నలో భాగంగా ఆ రెండు దేశాల‌తో విదేశీ కార్యాల‌య క‌న్సల్టేష‌న్ ప‌నుల‌తో పాటు కొన్ని ఆర్థిక ఒప్పందాల‌పై కూడా సంత‌కాలు చేయ‌నున్నారు. భార‌త్‌తో హిందూ మ‌హాస‌ముద్రం వార‌ధిగా స‌రుకు ర‌వాణా కార్య‌క‌లాపాలు సాగించే దేశాల్లో డ్జిబౌతీ ప్ర‌ముఖ‌మైన‌ది. 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఈ దేశం దాదాపు 284 మిలియ‌న్ డాల‌ర్ల వ‌రకు భార‌త్‌తో వ్యాపారం కొన‌సాగించింది. అందుకే రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ త‌న మొద‌టి అధికారిక విదేశీ ప‌ర్య‌ట‌న కోసం ఆ దేశాల‌ను ఎంచుకున్నార‌ని రాష్ట్ర‌ప‌తి ప్రెస్ సెక్ర‌ట‌రీ అశోక్ మాలిక్ తెలియ‌జేశారు. డ్జిబౌతీ దేశంలో ఓ సిమెంట్ ప్లాంట్ నిర్మించ‌డానికి భార‌త్ 49 మిలియ‌న్ డాల‌ర్ల‌ను లైన్ ఆఫ్ క్రెడిట్‌గా కేటాయించింది.ఇక ఇథియోపియా విష‌యానికి వ‌స్తే… 45 ఏళ్ల త‌ర్వాత ఆ దేశాన్ని సంద‌ర్శించ‌నున్న భార‌త రాష్ట్ర‌ప‌తిగా కోవింద్ నిలిచారు.