తృణ‌మూల్ నేత నివాసంలో నాటుబాంబులు

Arabul Islam
Arabul Islam

పశ్చిమ బెంగాల్ లో ఇటీవల స్థానిక ఎన్నికలు జరుగుతున్న వేళ, ఓ స్వతంత్ర అభ్యర్థి మద్దతుదారుడి మృతి కేసులో తృణమూల్ కాంగ్రెస్ శాస‌న‌స‌భ్యుడు అరాబుల్ ఇస్లాంను అరెస్ట్ చేసిన పోలీసులు, కోల్ కతాకు 25 కిలోమీటర్ల దూరంలోని భంగార్ లోని ఆయన ఇంట్లో సోదాలు జరుపగా, వందలాది నాటుబాంబులు పట్టుబడ్డాయి. హఫీజుల్ ముల్లా అనే వ్యక్తి ప్రచారం చేస్తుండగా, ఆయుధాలతో వచ్చిన దుండగులు అతని ముఖంపై తుపాకితో కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయన మరణించగా, హత్య వెనుక అరాబుల్ ప్రమేయంపై ఆధారాలు లభ్యం కావడంతో, ఆయన్ను అరెస్ట్ చేయాలని మమతా బెనర్జీ ఆదేశించారు. ఇక ఆయన అరెస్ట్ తరువాత ఇంట్లో సోదాలు జరుపగా, భూమిలో పాతిపెట్టిన బక్కెట్ల కొద్దీ బాంబులు కనిపించాయి. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అరాబుల్ ను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఘటన జరిగిన రోజు తాను భంగార్ ప్రాంతంలో లేనని అన్నారు. ఇక అరాబుల్ అరెస్ట్ బాధిత కుటుంబానికి కంటితుడుపు చర్యేనని విపక్షాలు వ్యాఖ్యానించారు. కాగా, అరాబుల్ వైఖరితో గతంలోనూ మమతా బెనర్జీ ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. అతన్ని 2013లో పార్టీ నుంచి సస్పెండ్ చేసిన మమత, ఆపై ఏడాదిన్నర తరువాత మరోసారి పార్టీలోకి తీసుకున్నారు. ఆయన్ను ఇప్పుడు మరోసారి సస్పెండ్ చేయవచ్చని తెలుస్తోంది.