టిడిపి వ్యాఖ్య‌లు హాస్యాస్ప‌దంః జ‌వ‌దేక‌ర్‌

Prakash javadekar
Prakash javadekar

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి ఏం చేయాలో అవన్నీ చేశామని, ఇంకా ఏం యేం చేయాలో చేస్తామని తాము రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించడం లేదని కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. నేడు ఢిల్లీలో ఏపి సీఎం చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాతో మాట్లాడుతూ బిజెపిపై విమర్శలు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రకాశ్‌ జవదేకర్‌ మాట్లాడుతూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లో నిజాలు లేవని అన్నారు. అభివృద్ధి విషయంలో తాము రాజకీయాలు చేయమని, ఎన్డీయే నుంచి టిడిపి విడిపోయాక కూడా ఏపి అభివృద్ధికి కట్టుబడే ఉన్నామని ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. తాము స్నేహం కేంటే భారత ప్రజలు, అభివృద్ధికే ఎక్కువ విలువ ఇస్తామని చెప్పుకోచ్చారు. తాము గతంలో టిడిపితో కలిసి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశామని, అప్పుడు టిడిపి నేతలు కాంగ్రెస్‌ నేతలను కలుస్తున్నారని విమర్శించారు. అమిత్‌ షా ఇప్పటికే ఏపి ప్రభుత్వానికి లేఖ రాసి అందులో ఏపికి ఏం యేం చేశామో చెప్పారని ప్రకాశ్‌ జవదేకర్‌ అన్నారు. అమరావతిలో రాజధాని నిర్మాణానికి, పోలవరం ప్రాజెక్టుకు కూడా తాము సాయం చేస్తున్నామని అన్నారు. వైఎస్సార్సీపితో బిజెపి మైత్రి పెంచుకుంటోందంటూ టిడిపి హాస్యాస్పద వ్యాఖ్యలు చేస్తోందని, అటువంటి ప్రయత్నాలు తాము చేయడం లేదని అన్నారు. తాము దేశంలో అన్ని రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని జవదేకర్‌ చెప్పారు.