కోర్టుకేసులు దాఖలుచేయండి..పన్నువసూళ్లు పెంచండి

TAX
TAX

రాష్ట్రాలకు సిబిడిటి ఛైర్మన్‌ లేఖలు
న్యూఢిల్లీ: ప్రత్యక్షపన్నుల వసూళ్లలోనెలకొన్న మందగమనం ఆందోళనకర పరిణామమని తక్షణమే అన్ని రాష్ట్రాల్లోని ఆదాయపుపన్నుశాఖ అధికారులు తమతమ కసరత్తులు ముమ్మరంచేయాలని, లక్ష్యనిర్ధేశిత సర్వేలు చేసి అవసరమైతే కోర్టుకేసులు దాఖలుచేయాలని ఉద్దేశ్యపూర్వకంగా పన్నులు ఎగవేస్తున్నవారిభరతం పట్టాలని సిబిడిటి ఛైర్మన్‌ సుశీల్‌చంద్ర ఆదేశాలు జారీచేసారు. ఐటి శాఖలోని అందరు ప్రిన్సిపల్‌చీఫ్‌ కమిషనర్లకు ఆయన లేఖలురాస్తూ ఆర్ధికసంవత్సరం కేవలం మూడునెలలు మాత్రమే ఉందని, ఈ కాలంలో పన్నువసూళ్లు మరింత వేగవంతం కావాలని కోరారు. వివిథ ఉపఖాతాలకింద వచ్చిన వసూళ్లు అత్యంత మందగమనంతో ఉన్నాయని, వృద్ధి మందగించిందని ఆయన గుర్తుచేసారు. ప్రస్తుత డిమాండ్‌ 1.1శాతం తక్కువగా ఉందని, అంతకుముందు సంవత్సరంలో 15.6శాతం నమోదయిందని అన్నారు. ఎక్కువ ప్రాంతాల్లో ప్రతికూలంగా ఉందని, నిరంతరం వచ్చే అసెస్‌మెంట్‌ప న్నుకూడా తగ్గిందని వెల్లడించారు. కేంద్ర ప్రత్యక్షపన్నులబోర్డు ఐటి శాఖకు విధివిధానాలురూపొందించి వాటి విధినిర్వహణపై పర్యవేక్షణచేస్తున్నది. ప్రత్యక్షపన్నులపరంగా చంద్ర మాట్లాడుతూ డిసెంబరు నెలాఖరువరకూ వృద్ధి 13.6శాతంగా ఉందని,వాస్తవ లక్ష్యం 14.7శాతంగా ఉందని అన్నారు. స్థూల వసూళ్లు 14.1శాతం మెరుగుపడ్డాయని, అయితే ఇప్పటికీ లక్ష్యానికి తక్కువగానే ఉన్నాయన్నారు. బడ్జెట్‌ అంచనాలు 11,50 లక్షలకోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఇక పన్నువసూళ్లపరంగా జప్తుచేసిన ఆస్తుల రికవరీ కూడా మందగమనంగానే ఉంది. ఆశించినస్థాయిలో ఫలితాలు రావడంలేదని వెల్లడించారు. అంతేకాకుండా రాష్ట్రాలవారీగా, సర్కిళ్లవారీగా ప్రిన్సిపల్‌ చీఫ్‌కమిషనర్లు తమతమ ప్రాంతాల్లో వసూళ్లను మరింత కఠినతరంచేయకపోతే లక్ష్యాలు చేరుకోవడం కష్టం అవుతుందని సుశీల్‌చంద్ర హెచ్చరించారు.