కోదండరామ్‌ అరెస్ట్‌ అప్రజాస్వామికం: రేవంత్‌రెడ్డి

Revanth
Revanth Reddy

హైదరాబాద్‌: కోదండరామ్‌ని అరెస్ట్‌ చేయటం పూర్తిగా అప్రజాస్వామికమన్న తెలంగాణ వస్తే ధర్నాలు లాఠీఛార్జీలు ఉండవని, ఎవరూ ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని మభ్యపెట్టిన కేసిఆర్‌ తీరా తెలంగాణ సాధించుకున్న తర్వాత ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు తమ గొంతుకని  వినిపించడానికి కూడా అవకాశం ఇవ్వడంల లేదని టి.టిడిపి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో ఉద్యోగాల కోసం  ఉద్యమించే నిరుద్యోగులను, ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రజాస్వామ్యవాదులను పోలీసు బలంతో అణిచివేయాలనుకుంటున్న సిఎం కేసిఆర్‌ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎంతోకాలం పరిపాలన కొనసాగించలేరని ఆయన హెచ్చరించారు. శనివారం అమరవీరుల స్ఫూర్తియాత్రకుబయల్దేరిన టిజెఎసి ఛైర్మన్‌ కోదండరామ్‌ అరెస్ట్‌ నేపథ్యంలో మీడియాకు దీనిపై స్పందన రేవంత్‌ తెలిపారు. పరాయి పాలనలో కొనసాగిన  ధర్నాచౌక్‌ను ఎత్తివేయడం కేసిఆర్‌ అనైతిక, అప్రజాస్వామిక విధానానికి నిదర్శమని విమర్శించారు. గతంలో నిరుద్యోగ ర్యాలనీ, మల్లన్నసాగర్‌ భూనిర్వాసితుల రైతులను ఇలాగే అణిచివేశారని గుర్తుచేశారు. ఇసుకలారీల దౌర్జన్యాలపై ప్రశ్నించిన నేరెళ్ల దళితులను పోలీసులతో చిత్రహింసలకు  గురి చేశారని, అఖరికి అడవిబిడ్డలైన గుత్తికోయలను కూడా అడవుల దోపిడికి అడ్డుపతున్నారనీ వారిపై కూడా దాడి చేయించారని రేవంత్‌ ఆరోపించారు. ఇదేనా ప్రజలు ఆశించిన బంగారు తెలంగాణ అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ సాధనకు మూలమైన అమరుల స్ఫూర్తి యాత్రకు అడ్డు చెప్పటమేంటని ఇది పూర్తిగా కేసిఆర్‌ దొర అహంకార పరిపాలనకు అడ్దం పడుతుందని రేవంత్‌ దుయ్యబట్టారు. శాంతియుత అమరుల స్ఫూర్తియాత్రకు అనుమతి నిరాకరణ, విద్యార్థులను జేఎసి నాయకులను అక్రమ అరెస్ట్‌లు చేయడం వంటివి  కేసిఆర్‌ నియంతృత్వ పాలనకు నిదర్శనాలుగా ఆయన పేర్కొన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కి పట్టడమే ప్రభుత్వ ధ్యేయంగా పెట్టుకుందని ఆయన అభిప్రాయపడ్డారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో దౌర్జన్య పాలనకు సహించబోమని రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.