కేంద్రానికి చౌకీదారుగా ఎఐఎడిఎంకె!: కమల్‌

Kamal hassan
Kamal hassan

చెన్నై: తమిళనాడు ఎఐఎడిఎంకె ప్రభుత్వం కేంద్రప్రభుత్వానికి చౌకీదారుగా పనిచేస్తోందని, అందువల్లనే కేంద్రం రాష్ట్ర హక్కులను తొక్కిపెట్టిందని తమిళనటుడు ఎంఎన్‌ఎం అధినేత కమల్‌హాసన్‌ ఆరోపించారు.చ కేంద్రప్రభుత్వం స్పష్టమైన సుప్రీంకోర్టు తీర్పు ఉన్నప్పటికీ కావేరి బోర్డు ఏర్పాటుపై నిర్లక్ష్యం చేస్తోందని ఆయన మండిపడ్డారు. సిఎంబి ఏర్పాటు బాధ్యత కేంద్రంపైనే ఉందని, తమిళనాడుప్రభుత్వం ఇప్పటికీ తాము ప్రజలకిచ్చిన వాగ్దానాలను అమలుచేయలేకపోతున్నామని గుర్తించడంలేదని, బాధ్యతను విస్మరిస్తోందని అన్నారు. కావేరి కేసులో కేవలం ధిక్కరణ పిటిషన్‌ దాఖలుచేసి చేతులు దులుపుకున్నదని, ఇక రాష్ట్రంలో నిర్వహించే నిరసన అంతా ఒక ఫార్సు అని ఆయన నిప్పులుచెరిగారు. కావేరి జలాల వివాదంలో నెలకొన్న కీలక సమస్యలను ప్రజలకు తెలియజేస్తామని, తమ మొట్టమొదటి బహిరంగసభలో కావేరిపై ప్రజలకు సమగ్రంగా వివరిస్తామన్నారు. ఇదే సభలో తమ పార్టీకి చెందిన కీలక మార్గదర్శకాలనుసైతం వెల్లడిస్తామన్నారు. వచ్చేఐదునెలల్లో తమ పార్టీ విధివిధానాలతోకూడిన దస్త్రాన్ని ప్రకటిస్తామని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు తమిళప్రజల శ్రేయస్సును పరిగణనలోనికి తీసుకుని కేంద్రాన్ని సిఎంబి ఏర్పాటుకు ఉత్తర్వులుజారీచేస్తుందన్న ధీమా వ్యక్తంచేసారు. వాస్తవానికి ఆరువారాల గడువు పూర్తయినా కేంద్రం కర్నాటక ఎన్నికలసాకుతో పక్కనపెట్టిందన్నారు. సుప్రీంకోర్టు ఎలాంటి గడువు పొడిగింపు ఉండదనినిష్కర్షగా చెప్పిందని, ప్రస్తుతం 2016లో ఏంజరిగిందో అదే మళ్లీ పునరావృతం అయిందని అన్నారు. 2016 సెప్టెంబరులో సుప్రీంకోర్టు కావేరి నదీయాజమాన్యబోర్డునునాలుగువారాల్లోపు ఏర్పాటుచేయాలని కోరిందని, ఆప్పుడు కూడా కేంద్రం బోర్డు ఏర్పాటులో ఘోరంగా విఫలం అయిందన్నారు. న్యాయపరమైన సాంకేతిక లోపాలు చూపిస్తూ బోర్డు ఏర్పాటును వాయిదా వేసాయని కమల్‌హాసన్‌ అన్నారు. తమిళ ప్రజలకు న్యాయం జరగడంలేదని, ఏవరో ఒక అదృశ్యశక్తి ప్రజలకు అన్యాయంచేస్తోందని అడ్డుకుంటున్నదని ఆయనఅన్నారు. అంతేకాకుండా ఆయారాష్ట్ర ప్రభుత్వాలు డెల్టా రైతుల జీవితాలతో ఆడుకుంటున్నాయని, సరిహద్దుల్లో కర్నాటక తమిళనాడుల్లో ఎక్కువ ఉందని ఆయన విమర్శించారు. తమిళనాడులో ఇప్పటికే భూగర్భజలాలు అడుగంటిపోయాయని ఆయన అన్నారు.