ఓబిసిలో వెనుక‌బ‌డిన కులాల వ‌ర్గీక‌ర‌ణ‌కు క‌మీష‌న్‌ ఏర్పాటు

Justice G.Rohini
Justice G.Rohini

న్యూఢిల్లీః ఓబీసీ కులాల్లో రిజ‌ర్వేష‌న్ల అమ‌లులో త‌లెత్తుతున్న అస‌మాన‌త‌లు తొల‌గించే ఉద్దేశంతో వారిలో బాగా వెనుక‌బ‌డిన కులాల‌ను గుర్తించి వ‌ర్గీక‌ర‌ణ చేసే అంశంపై రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ఓ క‌మిష‌న్‌ను నియ‌మించారు. ఐదుగురు స‌భ్యులు ఉన్న ఈ క‌మిష‌న్ నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తెలుగు రాష్ట్రానికి చెందిన జ‌స్టిస్ జి. రోహిణికి ఆయ‌న అప్ప‌గించారు. ప్ర‌స్తుతం ఢిల్లీ హైకోర్టు విశ్రాంత ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ఆమె కొన‌సాగుతున్నారు. ఈ కమిష‌న్‌కి కార్య‌ద‌ర్శిగా కేంద్ర సామాజిక న్యాయం-సాధికార‌త శాఖ సంయుక్త కార్య‌ద‌ర్శి వ్య‌వ‌హరించనున్నారు. ఓబీసీ కులాల్లో బాగా వెనుకబడిన ఓబీసీలకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రయోజనాలు లభించేందుకు వర్గీకరణ అవ‌స‌ర‌మ‌ని కేంద్ర సామాజిక న్యాయం – సాధికార‌త మంత్రిత్వ శాఖ పేర్కొంది. రిజర్వేషన్ అమ‌ల్లో అసమానతల గురించి, వాటిని నివారించేందుకు వ‌ర్గీక‌ర‌ణ ఎలా ఉప‌యోగ‌ప‌డ‌నుంద‌నే అంశాల గురించి, అందుకు కావాల్సిన యంత్రాంగం గురించి ఈ కమిషన్ అధ్య‌య‌నం చేయ‌నుంది. ఛైర్‌పర్సన్‌ బాధ్యతలు చేపట్టిననాటి నుంచి 12 వారాల్లో కమిషన్‌ తమ నివేదికను రాష్ట్రపతికి సమర్పించాల్సి ఉంటుంది.