ఉచిత బియ్యం ప‌థ‌కాన్ని అడ్డుకోలేదుః కిర‌ణ్‌బేడి

Kiran bedi
Kiran bedi

పుదుచ్చేరిః కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఉచిత బియ్యం పథకాన్ని తాను అడ్డుకోలేదని ఆ రాష్ట్ర లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేదీ స్పష్టం చేశారు. పుదుచ్చేరిలో గవర్నర్‌ కార్యాలయం రాజ్‌నివాస్‌లో సోమవారం విలేఖరులతో మాట్లాడుతూ, రాష్ట్రప్రభుత్వం అమలుచేయదలచిన పథకాలను తాను అడ్డుకున్నట్టు వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. తనకు తమిళ భాష రాకపోవడంతో ఈ విషయాలను ప్రజలకు తెలిపేందుకు ఇబ్బందులు తలెత్తున్నాయని తెలిపారు. తాను పథకాలను అడ్డుకుంటున్నాన‌ని ఎవరైనా భావిస్తే, సమాచార హక్కు చట్టం ప్రకారం రాజ్‌నివాస్‌ నుంచి వివరాలను పొందవచ్చన్నారు. గతంలో ఉన్న గవర్నర్‌ కార్యాలయ పనితీరులో వినూత్న‌ మార్పులు చోటుచేసుకున్నారు. ప్రజలు నేరుగా కార్యాలయానికి వచ్చి సమస్యలను తెలిపే పరిస్థితులు నెలకొన్నాయని తెలిపారు. తాను బాధ్యతలు చేపట్టిన ఏడాది కాలంలో నెలకు 1,000 చొప్పున వినతులు అందాయన్నారు. రాజ్‌నివాస్‌ ప్రజలకు చేరువగా ఉండాలన్నదే తన అభిమతమని, ఇందులో పేదలు, ధనికులు అన్న తేడా లేకుండా అందరికి సమన్యాయం చేయడమే తన లక్ష్యమని గవర్నర్‌ పేర్కొన్నారు.