ఆన్‌లైన్‌ వేలంలో మాల్యా ఆస్తులకు బిడ్డర్లు నిల్‌!

– కింగ్‌ఫిషర్‌ హౌస్‌ కొనుగోలుకు ఒక్కరుకూడా రానివైనం!
ముంబై : కింగ్‌ఫిషర్‌ బకాయిల వసూలు కోసం 17 బ్యాంకుల కూటమి ఈవేలంలో ప్రకటించిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌ కొనేందుకు ఒక్కరుకూడా వేలంలో దరఖాస్తు చేయలేదు. కింగ్‌షిఫర్‌ ఎయిర్‌లైన్స్‌పరంగా 6963 కోట్ల రూపాయలు ఎస్‌బిఐతోపాటు 17 బ్యాంకులకు బకాయిపడిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా విజయ్ మాల్యాకు చెందిన కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను వేలం వేసేందుకు ఉపక్రమించాయి. వేలంలో బేస్‌ ధరను 150 కోట్ల రూపాయలుగా ప్రకటించి ఆన్‌లైన్‌లో పాల్గొనాలని నోటిఫికేషన్‌ జారీచేసారు. ఎస్‌బిఐ ఆధ్వర్యంలో ఈ వేలం ప్రక్రియ కొనసాగింది. 17 వేల చదరపు అడుగుల వైశాల్యంలో నిర్మించిన విల్లేపార్లే భవనం ఎస్‌బిఐ క్యాప్స్‌ ట్రస్టీ వేలం ప్రకటించింది. కాగా ఒక్కరుకూడా బిడ్డింగ్‌లో పాల్గొనక పోవడం బ్యాంకర్లను ఆశ్చర్యపరిచింది. గత ఏడాది ఫిబ్రవరి నెలలో బ్యాంకుల కూటమి ఈ స్థిరాస్తిని స్వాధీనం చేసుకుంది. 2012లో ప్రారంభించిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ భారీనష్టాలు, అప్పుల ఊబిలో కూరుకుపోయింది. బ్యాంకులకు వేలాది కోట్లు బకాయిపడింది. బ్యాంకర్లు తమ రుణాలు 9 వేల కోట్లను రికవరీ చేసుకునేందుకు ప్రధాన ప్రమోటర్‌ విజ§్‌ుమాల్యా కింగ్‌ఫిషర్‌ హౌస్‌ను స్వాధీనం చేసుకుని వేలం వేయాలని నిర్ణయించింది. అయితే వేలంలో ఒక్కరుకూడా పాల్గొనకపోవడం ఆశ్చర్యకరమైన అంశం. ఇదిలా ఉండగా మాల్యా ఈ నెల ప్రారంభంలోనే దేశం విడిచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.