శర్వాని దృష్టిలో పెట్టుకునే కథ రాశా

Director, Hanu Raghava pudi
Director, Hanu Raghava pudi

‘అందాల రాక్షసి’, ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’, ‘లై’ చిత్రాల దర్శకుడు తెరకెక్కించిన తాజా చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది. శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటించారు. ఈ సినిమాకు చెరుకూరి సుధాకర్‌ నిర్మాత. ఈ చిత్రం గురించి హను రాఘవపూడి హైదరాబాద్‌లో గురువారం విలేకరులతో ముచ్చటించారు. ఆ విశేషాలు..

లవ్‌ స్టోరీస్‌ మీ బలం అని అనుకుంటున్నారా?
– అలాంటిదేమీ లేదండీ. మన బలం మనకు తెలియదు. అవతలివాళ్లే చెప్పాలి.

 మిమ్మల్ని మణిరత్నంతోనూ, సుకుమార్‌తోనూ పోలుస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది?
– కాంప్లిమెంట్స్‌ మంచివే కదండీ. పాజిటివ్‌గానే తీసుకుంటా. వారి క్రాఫ్టింగ్‌ నాకు చాలా ఇష్టం.

‘పడి పడి లేచె మనసులో బ్రేకప్‌ ప్రాబ్లమ్‌ ఉంటుందా?
– ఇందులో బ్రేకప్‌ మాత్రమే ప్రాబ్లమ్‌ కాదు. ఆసక్తికరమైన కాన్ ఫ్లిక్ట్స్‌ ఉంటాయి. ప్రేమ కథ పాతదే. దాన్ని కొత్తగా చెప్పే విధానం బావుంటుంది.

 శర్వానంద్‌ను దృష్టిలో పెట్టుకుని కథ రాశారా?
– అవునండీ. శర్వానంద్‌ నాకు ఎప్పటి నుంచో తెలుసు. ఒకసారి నా కథను చరణ్‌కి కూడా చెప్పించాడు. ఎప్పటి నుంచో సినిమా చేయాలని అనుకుంటున్నాం. తనకోసం రెండు, మూడు లైన్స్ చెప్పాను. తను మాత్రం నాతో లవ్‌ స్టోరీ మాత్రమే చేయాలని అనుకున్నాడు. అదీ విషయం. అందుకే శర్వాని దృష్టిలో పెట్టుకునే కథ రాశా.

 కథలో నటించబోయే హీరో ఎవరన్నది ముందే తెలియడం పాజిటివా? నెగటివా?
– చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఎందుకంటే అవతలివ్యక్తి ఎంత మేర నటించగలరో మనకు ముందే తెలిసిపోతుంది. కొన్ని సందర్భాల్లో కాస్త టఫ్‌ కాన్సెప్ట్‌ కూడా.

ఈ కథకు పడిపడిలేచె మనసు అనే టైటిల్‌ పెట్టడానికి కారణం
– ఒకసారి నేను వెంకట్‌ సిధారెడ్డి కూర్చుని పాట వింటుంటే నాకు ఈ పదాల్లో ఏదో కథ ఉందనిపించింది. ఆ టైటిల్‌ని అనుకుని, దాన్నుంచి నేను డెవలప్‌ చేసుకున్న కాన్సెప్ట్‌ ఈ సినిమా. మంచి కథ, మంచి క్లైమాక్స్‌ కుదిరింది. దానికి తగ్గ నటీనటులు కూడా కుదిరారు. పాత్రలు రెండూ పోటాపోటీగా అనిపిస్తాయి. సినిమాలో భూకంపం సన్నివేశం కూడా ఉంటుంది. విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం ఇప్పటికే ప్రజాదరణ పొందింది.

మీరు ఎక్కువగా ప్రేమకథా చిత్రాలు తీస్తుంటారు. మీ అనుభవంలోనుంచి పుట్టినవా?
– లేదండీ. మన జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వాటిని మనం అంతగా పట్టించుకోం. లేని వాటి చుట్టూ తిరుగుతూ ఉంటాం. అలా ప్రేమ నా జీవితంలో లేదు. అందుకే దాని గురించి తిరుగుతుంటానేమో. సంజయ్‌లీలా భన్సాలీలో షాట్స్‌ అన్నీ రిచ్గా ఉన్నట్టు. నాకు భన్సాలీ సినిమాలన్నా, హిరాణీ చిత్రాలన్నా చాలా ఇష్టం. వాళ్లలాగా చేయాలని కలలు కనట్లేదు కానీ, వాళ్ల సినిమాలంటే చాలా ఇష్టం.

 పడి పడి లేచె మనసు సినిమాకు ఓవర్‌ బడ్జెట్‌ అయిందని టాక్‌ వచ్చింది?
– సూపర్‌ మార్కెట్‌కి వెళ్లి సరకులు కొంటాం. అక్కడ మనకు నచ్చినవి ఇంకో రెండు వస్తువులు ఉంటే కొంటాం. అది మన లిస్టులో లేదు కదా అని ఓవర్‌ బడ్జెట్‌ అయిందని అనుకోం కదా.. ఈ సినిమాకు కూడా అనుకున్నదానికన్నా 15 శాతం బడ్జెట్‌ ఎక్కువైంది. అది కూడా షూటింగ్‌ లొకేషన్లలో వాతావరణం అనుకూలించక. అది ఇప్పుడు నేను చెప్పడం కన్నా, సినిమాలో చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. నేను కోల్‌కతాలో కొన్నేళ్ల క్రితం ఓ ఆరు నెలలు ఉన్నాను. నాకు కోల్‌కతా అంగుళం అంగుళం తెలుసు. ఆ బ్యాక్‌డ్రాప్‌ని ఇప్పుడు ఈ సినిమాకు వాడుకున్నానంతే. లొకేషన్లు చాలా ఫ్రెష్‌గా ఉంటాయి.

‘మీ దగ్గర ఔట్‌ ఆఫ్‌ ద బాక్స్‌ కథలున్నాయా?
– ఉన్నాయండీ. అయితే వాటిని తీయడానికి సమయం ,సందర్భం కావాలి. ఒక పెద్ద హిట్‌ ద్వారా జనాల్లో నమ్మకం పెరుగుతుంది. ఆ హిట్‌ ద్వారా వచ్చే క్రెడిబిలిటీ వేరుగా ఉంటుంది. ‘అందాల రాక్షసి’ సినిమాకు ఫస్ట్‌ డే టాక్‌ వేరు. ఆ తర్వాత ఆ సినిమా నాకు తెచ్చిన గుర్తింపు వేరు.

‘లై’ సినిమా ఆడలేదని ఏమైనా ఫీలయ్యారా?
– ఆ సినిమాను నేను అనుకున్నట్టు తీయలేకపోయాను. హర్రీబర్రీగా చేయడం కావచ్చు, మరొకటి కావచ్చు. నేననుకున్నది వేరు. అక్కడ జరిగింది వేరు. రైటర్‌గా ఆ సినిమాకు నేను సక్సెస్‌ అయ్యాను. తీయడంలో ఎక్కడో పొరపాటు జరిగింది.

నానితో ఓ సినిమా చేస్తున్నారట కదా?
– కథ రెడీగా ఉంది. నాని మిలిటరీ లుక్‌ కావాలి. అందుకే తనకూ, నాకూ అవైలబిలిటీ ఉన్నప్పుడు చేస్తాం. ఇమీడియేట్‌గా మైత్రీ మూవీస్‌లో సినిమా ఉంది.

 సినిమాకు టఫ్‌ కాంపిటిషన ఉన్నట్టు భావిస్తున్నారా?
– చాలా సినిమాలు ఉంటాయి. వాటన్నిటి గురించి ఆలోచించడానికి మన చేతిలో ఏం ఉంటుంది? మా సినిమా బాగా వచ్చిందా? లేదా? అన్నదే కీలకం.