హీరోగానూ చేస్తా… క‌మెడియ‌న్‌గానూ చేస్తా!

`స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌`, `స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బీ`త‌ర్వాత స‌ప్త‌గిరి న‌టించిన‌ సినిమా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`. ఈ నెల 14న విడుద‌ల కానుంది. అరుణ్ ప‌వార్ ద‌ర్శ‌కుడు. వైభ‌వీ జోషి హీరోయిన్‌. ఈ సినిమా గురించి సప్త‌గిరి హైద‌రాబాద్‌లో మంగ‌ళ‌వారం విలేక‌రుల‌తో మాట్లాడారు. ఆ విశేషాలు..

Actor Saptagiri Interview
Actor Saptagiri

* హీరోగా హ్యాట్రిక్ కొట్ట‌బోతున్నారు.. చెప్పండి సినిమా… ఎలా ఉండ‌బోతోంది?
– `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌`, `స‌ప్త‌గిరి ఎల్ ఎల్ బి` త‌ర్వాత ఇప్పుడు చేస్తున్న మూడో సినిమా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌`. నేను హీరోగా చేసిన తొలి సినిమాకు మంచి పేరు, డ‌బ్బు వ‌చ్చాయి. రెండో సినిమాకు పేరు మాత్ర‌మే వ‌చ్చింది. ఇప్పుడు మూడో సినిమాగా `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌` చేశా. ఈ సినిమాకు అంద‌రి ఆశీస్సుల‌తో పేరూ, డ‌బ్బులూ రెండూ రావాలి. నాకున్నంత‌లో చాలా చిన్న బ‌డ్జెట్‌లో చేసిన సినిమా ఇది. భ‌గ‌వంతుడి ద‌య‌వల్ల చిన్న బ‌జ్ వ‌చ్చింది. ఆ బ‌జ్‌ని నిలుపుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నా. ఈ సారి మాత్రం ప్రేక్ష‌కులు ఒక క‌మెడియ‌న్ స‌ప్త‌గిరిని చూడ‌టానికి థియేట‌ర్‌కి రావ‌చ్చు.నా తొలి సినిమాలో నేను ఎమోష‌న్‌ని బాగా క్యారీ చేశాన‌నే పేరు తెచ్చుకున్నా. రెండో సినిమాలో కోర్టు సీన్లు బాగా చేశాన‌ని పేరు తెచ్చుకున్నా. ఈ సినిమాలో వాట‌న్నిటిని బ్యాల‌న్స్ చేస్తూ, ఓ మంచి క‌థ చెబుతూ, దాని చుట్టూ ఓ మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ని అల్లాం.

* ఈ సినిమాలో దొంగ‌గా న‌టించార‌ని…
– అవునండీ. వ‌జ్రం చుట్టూ తిరిగే క‌థ ఇది. ఈ సినిమాలో నా పాత్ర పేరు గోవిందు. నేను దొంగ‌ని. వ‌జ్రానికి, గోవిందుకు ఉన్న సంబంధం ఏంటి? ఆ వ‌జ్రం వ‌ల్ల అత‌ను ఎన్ని ఇబ్బందులు ప‌డ్డాడు? ఎన్ని లాభాలు పొందాడు? ఎంత ఎంట‌ర్‌టైన్ చేశాడు? ఎంత భావోద్వేగాల‌కు గురిచేశాడు అనేదే ఈ సినిమా.

* క‌మెడియ‌న్ ని చూడ్డానికి రండి అని అంటున్నారు. ఇందులో మీరు హీరోనా? క‌మెడియ‌నా?
– నేను హీరోనే. కానీ నా పాత్ర మొత్తం క‌మెడియ‌న్‌లాగా ఉంటుంది.

* అరుణ్‌ప‌వార్‌తో రెండో సినిమా చేస్తున్నారు?
– అరుణ్ ప‌వార్‌తో గ‌త సినిమా చేస్తున్న‌ప్పుడే మ‌నం క‌లిసి రెండో సినిమా చేద్దాం అని మాటిచ్చా. నాకు `వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌` క‌థ బ‌య‌టి నుంచి వ‌చ్చింది. మ‌హేంద్ర‌, ప‌చ్చ‌ల ప్ర‌కాశ్‌తో పాటు ఇంకో అబ్బాయి క‌లిసి ఈ క‌థ త‌యారు చేశారు. ఈ క‌థ ఎవ‌రు డైర‌క్ట్ చేస్తే బావుంటుంద‌ని అనుకుంటే, అప్పుడు మ‌ళ్లీ నాకు `స‌ప్త‌గిరి ఎక్స్ ప్రెస్‌` డైర‌క్ట‌ర్ అరుణ్ గుర్తొచ్చాడు. వెంట‌నే అరుణ్‌ని పిలిచి ఇచ్చాం. ఆయ‌న చాలా మంచి జాబ్ చేశారు. 

* ఫ‌స్ట్ చాయిసేనా ఇది..?
– ఫ‌స్ట్ చాయిసే అరుణ్‌. మామూలుగా క‌థ‌ను 15-20 మందికి చెప్పా. ఎవ‌రూ క‌వ‌చ‌ధ‌ర అనే ప‌దాన్ని ప‌ల‌క‌లేక‌పోయారు. గోవింద‌నామం స‌దా అజేయం, విజేయం అన్న‌మాట‌. నేను వెంక‌టేశ్వ‌ర‌స్వామి భ‌క్తుడిని కాబ‌ట్టి, వ‌జ్రం, గోవిందు క‌లిసి రావ‌డంతో గోవింద‌నామాల్లో ఒక‌టైన వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద అని పెట్టాం.

* క‌మెడియ‌న్‌గా ఎస్టాబ్లిష్ అవుతారు.. గుర్తింపు వ‌స్తుంది అని అంటున్నారు. హీరోగా గుర్తింపు తెచ్చుకోవాల‌ని లేదా?
– అలా ఏమీ లేదండీ. వ‌జ్ర‌క‌వ‌చ‌ధ‌ర‌గోవింద‌లో హీరో ఎవ‌ర్రా అంటే నా పేరే చెప్తారు. నా గ‌త రెండు సినిమాల్లో కామెడీ కాస్త త‌క్కువ‌గా చేశా. కామెడీ త‌క్కువ‌గా వెళ్లా. మెసేజ్ ఎక్కువ చేశా. అలా చేయ‌డానికి కార‌ణం నాలో ఉన్న అసిస్టెంట్ డైరక్ట‌ర్‌. నేను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా ఏడేళ్లు ప‌నిచేశా. అప్ప‌ట్లో నాకున్న థాట్ ప్రాస‌స్ మొత్తం ఆ సినిమాల్లో క‌నిపించింది. నా ఆలోచ‌న‌ల ప్రభావం వాటి మీద క‌నిపించింది. వాటి రెండిటిలో ఉన్న‌ట్టే ఇందులోనూ మెసేజ్ ఉంటుంది. హీరోగా నేను న‌టించేట‌ప్పుడు మెసేజ్ ఉండేట‌ట్టు చూసుకుంటా.

* మీరు హీరోగా చేస్తున్న‌ప్పుడు మీలోనూ అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ ఉన్నారు కాబ‌ట్టి, ఎంత‌వ‌ర‌కు ఇన్వాల్వ్ అవుతారు?
– తోచించి చెబుతానండీ. నాకు న‌చ్చింది అవ‌త‌లివాళ్ల‌కు న‌చ్చితే ఓకే. న‌చ్చ‌క‌పోయినా నో ప్రాబ్ల‌మ్‌. 

* డైర‌క్ట‌ర్‌ల‌ను క‌న్విన్స్ చేస్తారా?
– అలాంటిదేమీ లేదండీ. నాకు ఏమైనా డౌట్లు వ‌చ్చిన‌ప్పుడు అవ‌త‌లివాళ్లు వాటికి ఆన్స‌ర్ చేస్తే ఇక క‌న్విన్సింగ్ ఏమి ఉంటుంది.

* మీ గ‌త చిత్రాల‌తో పోలిస్తే కామెడీ పాళ్లు మీలో కాస్త త‌గ్గాయని అనిపించ‌డం లేదా?
– కేర‌క్ట‌ర్లు వ‌స్తే క‌మెడియ‌న్‌గా చేయ‌డానికి నేనెప్పుడూ సిద్ధ‌మే. ఇంత‌కు ముందు ఈ విష‌యాన్ని చాలా సార్లు చెప్పా. కానీ ఇప్పుడు ఓపెన్‌గా చెబుతున్నా, సీరియ‌స్‌గా చెప్తున్నా… నాకు కేర‌క్ట‌ర్లు రావ‌డం లేదు. హీరోగా చేస్తున్నాడు క‌దా, ఇక క‌మెడియ‌న్‌గా ఏం చేస్తాడులే అని అనుకుంటున్నారేమో. కానీ నేను చాలా ఇంట‌ర్వ్యూల్లో చెప్పా. ఆ త‌ర్వాత ప‌ర్స‌న‌ల్‌గానూ చాలా మందికి చెబుతున్నా. క‌మెడియ‌న్‌గా కేర‌క్ట‌ర్లు వ‌స్తే చేయ‌డానికి సిద్ధం. 

* సునీల్‌గారు కూడా కామెడీ టు హీరో టు కామెడీ చేస్తున్నారు. మీదీ అదే ట్రాకా? 
– నేను ఒక‌టి న‌మ్ముతానండీ. అంద‌రి జీవితాలు ఒకేలా ఉండ‌వు. ఐదు వేళ్లు ఒకేలా ఉండ‌వు. సునీల్ అన్న‌లా నేనుండ‌ను. ఆయ‌న ఆర‌డుగులు ఉంటాడు. నేను ఐద‌డుగులే. ఆయ‌న సిక్స్ ప్యాక్ చేశాడు. నేను యోగా నేర్చుకున్నా. ఆయ‌న‌ది భీమ‌వ‌రం. నాది చిత్తూరు. అందరి జీవితాలు ఒకేలా ఉండ‌వు. వాళ్ల వాళ్ల ప్రాప్తం. వాళ్ల వాళ్ల జీవితాల‌న్న‌మాట‌. 

* హీరోగా ఎలా ఎద‌గాల‌నుకుంటున్నారు?
– నేను క‌థ‌ను న‌మ్ముతా. క‌థే న‌న్ను ముందుకు తీసుకెళ్తుంది. నా శ‌క్తికి మించిన‌దైనా బాగా చేయాల‌నే అనుకుంటా. క‌థ లేక‌పోతే ఏ సినిమా అయినా ఇప్పుడు ఆడే ప‌రిస్థితుల్లో లేవు. ఇక‌మీద‌ట కూడా క‌థ‌నే న‌మ్ముకుంటా.

* డ్యాన్సులు, ఫైట్లు వంటి ఎలివేష‌న్లు క‌మెడియ‌న్లు హీరోగా చేస్తున్న సినిమాల్లో ఎక్కువ‌వుతున్నాయి అనే మాట ఉంది. దాన్నెలా చూస్తారు మీరు?
– అందులో ఏమైనా పొర‌పాట్లు ఉంటే దాన్ని దిద్దుకునే ప్ర‌య‌త్నం చేస్తాను. గ‌త రెండు సినిమాల్లో డ్యాన్సులు, ఫైట్లు బాగా చేశా. అందుకే ఈ సినిమాలో కాస్త ప‌క్క‌న పెట్టా. నా ఉద్దేశంలో నేను చెమ‌ట చిందిస్తేనే డ్యాన్సులు వేయ‌గ‌ల‌ను. ఇష్టంతోనే చేయ‌గ‌ల‌ను. అంతేగానీ చెమ‌ట చింద‌కుండా, రాత్రికి రాత్రి ఎవ‌రి ద‌గ్గ‌రికో వెళ్లి నాలుగు డ్యాన్సులు తెచ్చుకుని నింపేయ‌లేదు. నేను క‌ష్ట‌ప‌డే చేశా. అది కూడా ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్‌టైన్ చేయొచ్చేమో, వాళ్ల నుంచి మెప్పు పొంద‌వ‌చ్చేమో అనే ఆశ‌తోనే చేశా.

* క‌మెడియ‌న్ ఇమేజ్ అనేది హీరోకు అడ్డొస్తుందా?
– 100 శాతం అడ్డు వ‌స్తుంది. కానీ త్వ‌ర‌లోనే ఓవ‌ర్‌క‌మ్ చేస్తాను. అలాంటి మంచి క‌థ‌లు ఎంపిక చేసుకుంటున్నా. న‌న్ను నేను న‌మ్ముకున్న వ్య‌క్తిని. కాబ‌ట్టి నాకు స‌క్సెస్ వ‌స్తుంద‌ని న‌మ్ముతున్నా. ఇంకో చిన్న విష‌యం ఏంటంటే ఇండ‌స్ట్రీకి నేను 100 శాతం క‌మెడియ‌న్ అవుదామ‌ని మాత్రం రాలేదు. నేను అసిస్టెంట్ డైర‌క్ట‌ర్‌గా చేస్తున్న స‌మ‌యంలో నాలోని క‌మెడియ‌న్‌ని కొంద‌రు గుర్తించారు. ప్రామిస్ చేసి చెబుతున్నా… నాలో క‌మెడియ‌న్ అనేవాడు లేడు. కానీ న‌న్ను అబ్జ‌ర్వ్ చేసిన వాళ్లు అలా పాత్ర‌లు రాశారంతే. ఇవాళ్టికీ నా కామెడీని చూసి ఒకే ఒక్క సినిమాకే న‌వ్వా. అలా న‌వ్విన సినిమా వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్‌. ప్రేమ‌క‌థా చిత్రం సినిమా చూసి చాలా మంది బావుంద‌న్నారు. కానీ ఆ సినిమా క‌న్నా నాకు వెంక‌టాద్రి ఎక్స్ ప్రెస్ న‌చ్చింది. నేను డైర‌క్ట‌ర్ కావాల‌ని వ‌చ్చా. కృష్ణ‌వంశీగారి సిందూరం, శంక‌ర్‌గారి భార‌తీయుడు చూసి ఆ త‌ర‌హా సినిమాలు తెర‌కెక్కించాల‌ని ఇండ‌స్ట్రీకి వ‌చ్చా. కాక‌పోతే ఇప్పుడు క‌మెడియ‌న్ అనేది నాకు గుర్తింపు తెచ్చింది. హీరోగా మూడు సినిమాల‌కూ అది ఉప‌యోగ‌ప‌డింది. మంచి ఓపెనింగ్స్ వ‌స్తున్నాయి. ఇదంతా క‌మెడియ‌న్ అనే గుర్తింపు వ‌ల్లే.

* ద‌ర్శ‌క‌త్వం చేసే ఆలోచ‌న‌లున్నాయా?
– ఇప్పుడైతే ఆ ఆలోచ‌న‌లు లేవండీ. 

* మీ సినిమాల‌కు, మీరే డైర‌క్ట్ చేసే అవ‌కాశాలున్నాయా?
– అలాగ‌నేం కాదు. కానీ నా ఆలోచ‌నా విధానం వ‌ల్ల‌నే నేను కొన్ని ప‌ర్టిక్యుల‌ర్ క‌థ‌ల‌ను ఎంపిక చేసుకుంటున్నా. మా నాన్న కానిస్టేబుల్‌. ఆయ‌న 30 ఏళ్లు ప‌డ్డ క‌ష్టం చూసి నేను తొలి సినిమా చేశా. రెండో సినిమాలో రైతుల‌కు న్యాయం జ‌ర‌గాల‌నే కాన్సెప్ట్ ఉంటుంది. ఇందులో క్యాన్స‌ర్ రోగుల‌కు మంచి జ‌ర‌గాల‌నే మెసేజ్ ఉంటుంది. ఆలోచ‌న మంచిదైతే స‌రిపోదు.. ఆచ‌ర‌ణ కూడా స‌రైన మార్గంలో ఉండాలి. లేకుంటే దేవుడు శిక్షిస్తాడు అనే కాన్సెప్ట్ తో చెప్పాం. దేవుడికి, మ‌నిషికీ ఉన్న చిన్న ర్యాపోని మాకున్న లిమిటెడ్ బ‌డ్జెట్‌లో చెప్పాం.