కేర‌ళ వ‌ర‌ద బాధితుల‌కు అల్లు అర్జున్ విత‌ర‌ణ‌

Allu Arjun
Allu Arjun

హైదరాబాద్‌: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేరళ ప్రజలకు అండగా నిలిచేందుకు కథానాయకుడు అల్లు అర్జున్ ముందుకొచ్చారు. తన వంతుగా రూ.25 లక్షలు విరాళం ఇస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో స్పందించారు. ‘కేరళ వరద బాధితుల సంక్షేమం కోసం దేవుడ్ని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నా. కేరళ ప్రజలు నాపై చూపిన అమితమైన ప్రేమ, అభిమానం.. నా హృదయంలో వారికి ప్రత్యేక స్థానాన్ని ఏర్పరిచింది. వారి కోసం నా వంతుగా సహాయం చేయాలి అనుకుంటున్నా. రూ.25 లక్షలు కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా ఇస్తానని ప్రమాణం చేస్తున్నా. ప్రేమతో మీ ‘మీ అల్లు అర్జున్’ అని బన్నీ ట్వీట్లు చేశారు. ఇప్పటికే వరద బాధితుల కోసం నటుడు కమల్‌ హాసన్ రూ.25 లక్షలు విరాళం ఇచ్చారు. సూర్య, కార్తి కలిపి రూ.25 లక్షలు విరాళం అందించారు. కేరళలో అల్లు అర్జున్‌కు మంచి క్రేజ్‌ ఉంది. ఆయన నటించిన సినిమాల్ని దాదాపు ఆ రాష్ట్రంలో విడుదల చేస్తుంటారు. అంతేకాదు సినిమా మంచి టాక్‌తో.. బాక్సాఫీసు వద్ద చక్కటి వసూళ్లను కూడా రాబడుతుంటుంది. అక్కడి ప్రేక్షకులు బన్నీని ‘మల్లు అర్జున్‌’ అని ప్రేమగా పిలుచుకుంటుంటారు.